సార్వత్రిక ఎన్నికల సందడి ఆంధ్రప్రదేశ్ లో పీక్స్ కి చేరుకుంటుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ – జనసేనలు ఉమండి మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. చంద్రబాబు, జగన్ లలో ఉద్యోగులకు ఎవరు ఏ మేరకు మేలు చేశారనే చర్చ మొదలైంది.
అవును… సుమారు మరో పది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులెవరూ చంద్రబాబుకి ఓటు వేసే పరిస్థితి లేదనే చర్చ బలంగా మొదలైంది! ఇదే సమయంలో… ఎస్సీ, ఎస్టీలు కూటమివైపు ఎలాగూ చూడటం లేదు! ఇక ముస్లింల ఓట్ల సంగతి చెప్పేపనేలేదు. చేతి వృత్తులవారి పరిస్థితీ అలానే ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో యువత, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జనసేనతో కలిసి టీడీపీ వ్యూహాలు రచిస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఉద్యోగులు, పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులు లక్ష్యంగా టీడీపీ అనుకూల మీడియా కథనాలిస్తోందనే చర్చ మొదలైంది. దీంతో… అసలు ఆ కథనాల్లో వాస్తవం ఎంత..? నిజంగా ఉద్యోగులకు మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు..? అనే ప్రశ్నలు ఇప్పుడు వైరల్ గా మారాయి!
ఉద్యోగులకు జగన్ ఏమి చేశారు..?:
ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారు.
ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిస్తున్నారు.
చిన్న స్థాయి ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
జగన్ హయాంలో 10,177 మంది ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేశారు.
వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న 11 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు.
1.35 లక్షలమందిని గ్రామ / వార్డు సచివాలయాల్లో నియమించారు.
సీపీఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారు.
మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ 2 నెలల నుంచి 6 నెలలకు పెంచారు.
ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే అని అంటూ మీడియాకు వివరించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి. ఇదే సమయంలో కొవిడ్ వల్ల రాష్ట్రానికి రూ.76వేల కోట్ల నష్టం వాటిల్లడం వల్లే జీపీఎఫ్, సరెండర్ లీవులు, ఏపీజీఎల్ఐ, టీఏ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగింది కానీ.. ఆ మాటున జరుగుతున్న తప్పుడు ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు.
ఈ సందర్భంగా… చంద్రబాబు హయాంలో ఉద్యోగుల పరిస్థితిని గుర్తుచేస్తున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా… చంద్రబాబు హయాంలో ఉద్యోగులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండేదని, జన్మభూమి కమిటీ మీటింగుల్లో చోటా మోటా నేతలు కూడా ఉద్యోగులపై పెత్తనం చేస్తూ తిట్లదండకం అందుకునేవారని గుర్తుచేస్తున్నారు.
ఇదే సమయంలో… అధికారంలో ఉన్నప్పుడు 4 పెండింగ్ డీఏలు ఇవ్వాలని అడిగితే… “అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటాను కానీ డీఏలు ఇచ్చేది లేదు” అని మొండికేసిన చరిత్ర చంద్రబాబు సొంతం అని చెబుతున్నారు!