ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వరుస గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. మొన్న రెవిన్యూ లోట్ అంటూ పదివేళ కోట్లకు పైగా నిధులు కేంద్రం నుంచి రావడంతోపాటు.. నిన్న పొలవరం పనులకు సంబంధించిన 12వేల కోట్ల విడుదలకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది! ఈ నేపథ్యంలో జగన్ కు మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ఇది గొప్ప సాధనంగా వైసీపీ వాడేసుకునే ఛాన్స్ ఉంది.
ఏపీలో సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి జగన్ ను ఎవరూ వేళెత్తి చూపించలేది పరిస్థితి. ఇది ప్రతిపక్షాలు సైతం ఆఫ్ ద రికార్డు ఒప్పుకునే విషయం! అయితే పరిపాలన అంటే పంచడం మాత్రమే కాదు.. అభివృద్ధి కూడా ముఖ్యం అని విపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. అయితే ఇకపై ఆ విషయంలో కూడా విపక్షాలకు ఛాన్స్ లేకుండా చేస్తున్నారు జగన్.
ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమం, అభివృద్ది నిర్ణయాలతో ప్రతిపక్షాలకు చెక్ పెడుతున్నారు. జీఐఎస్ సమ్మిట్ లో జరిగిన ఒప్పందాలు కాకుండా.. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 28 సెజ్ లు, 293 పారిశ్రామిక పార్కులు, 31 ఎం.ఎస్.ఎం.ఈ క్లస్టర్లు, మూడు పారిశ్రామిక కారిడార్లు, నాలుగు పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అంతే కాకుండా ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీపై రూ.4500 కోట్లతో ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్ మిట్టల్ ప్రకటించడం గమనార్హం.
విశాఖలో జరిగిన జీఐఎస్ సదస్సులో ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూ.13.5 లక్షల కోట్ల ఎంవోయూలను ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ విశాఖ సదస్సు ఒప్పందాలపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖకు సంబంధించి 100 ఒప్పందాలు చేసుకోగా ఇప్పటికే రూ.2,739 కోట్ల విలువైన 13 ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చాయి. వీటి ద్వారా దాదాపు 6,858 మందికి ఉద్యోగ ఉపాధి లభించనుంది.
ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం “టాప్ ఎచీవర్స్” పేరుతో ఏడు రాష్ట్రాలను ప్రకటించగా.. అందులో ఆంధ్రప్రదేశ్ 100 కి 97.89 శాతం స్కోర్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. సీఎం జగన్ దావోస్ పర్యటన సందర్భంగా రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్ కో, అరబిందోలతో ఆంధ్రప్రదేశ్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో… ఏపీకి ఈ అవార్డు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో… అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడుసార్లు తొలి స్థానంలో నిలిచినట్లయ్యింది.
దీంతో… కరోనా మహమ్మారి వంటి భయంకర విపత్తులు రాష్ట్రంలో ప్రబలి, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. జగన్ మాత్రం మొక్కవోని దీక్షతో నాడు సంక్షేమ పథకాలపై దృష్టి, నేడు పారిశ్రామిక రంగం, అభివృద్దిపై దృష్టి సారించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.