మీడియా రెండు రకాలు. ప్రభుత్వ మీడియా, ప్రైవేటు మీడియా. ప్రభుత్వ రంగంలో ఉన్న ఆకాశవాణి, దూరదర్శన్ చాలా యేళ్ళు రాజ్యమేలాయి. వార్తలకోసమే కాదు, సినిమాల కోసం, వినోదం కోసం ఈ రెండు మాధ్యమాలే దిక్కు. ఆదివారం మధ్యాహ్నం ఆకాశవాణిలో వచ్చే నాటిక, సాయంత్రం దూరదర్శన్ లో వచ్చే సినిమా కార్యక్రమాలు బాగా ఆదరణ పొందాయి. మిగతావన్నీ ఎదో రేడియో ఉంది కాబట్టి వినడం, టివి ఉంది కాబట్టి చూడడం. అయితే ఈ రెండు మాధ్యమాలు ప్రభుత్వ అధీనంలో ఉన్న కారణంగా వార్తల్లో అధికార పార్టీ గొంతు ఎక్కువ, ప్రతిపక్ష పార్టీ గొంతు తక్కువ వినిపించేవి. అంటే వార్తల “నియంత్రణ” జరిగేది. ఇక వినోదం కూడా అలాగే ఉండేది.
“నియంత్రణ” పట్ల ప్రజల్లో “ఏవగింపు” మొదలై ప్రజలు “నియంత్రణ” లేని వార్తలు కోరుకుంటున్న రోజులు మొదలవుతున్న తరుణంలో ప్రైవేటు రంగంలో వార్తా ఛానళ్ళు (టివిలు) రావడంతో అలా వచ్చిన మొదటి ఛానల్ విపరీతంగా ప్రజల ఆదరణ పొందింది. ఇప్పుడు అలాంటి ఛానళ్ళు చాలా వచ్చాయి. ఇప్పుడు వాటి కార్యక్రమాల పట్ల కూడా ప్రజల్లో అదో రకం “ఏవగింపు” మొదలయ్యింది. టివిల సంగతి కాసేపు పక్కన పెడితే, పత్రికలు తొలినాళ్ళలో ప్రధాన భూమిక పోషించాయి. పత్రికలో వార్త వచ్చిందంటే అది వాస్తవమే అనే విశ్వాసం ప్రజల్లో ఉండేది. ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపించి ప్రజల, ప్రతిపక్షాల గొంతు కాస్త ఎక్కువ వినిపించే ప్రయత్నం పత్రికలు చేసేవి. బహుశా అందుకే పత్రికారంగాన్ని ప్రజాస్వామ్యానికి “నాలుగో స్థంభం” అని పిలిచేవారు. దురదృష్టం ఏమంటే ఇప్పుడు ఈ ప్రైవేటు రంగంలోని వార్తా ఛానళ్ళు, పత్రికలు “యాజమాన్య నియంత్రణ”లో కట్టుబానిసలయ్యాయి. మీడియా అనేది “ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం” స్థాయినుండి “వ్యాపారానికి మూలస్థంభం” దశకు చేరడంతో వార్తలు “యాజమాన్య నియంత్రణ”కు గురవుతున్నాయి. యాజమాన్యానికి ఉండే ఆర్ధిక, రాజకీయ, సామాజిక అవసరాల మేరకు మాత్రమే వార్తలను ఎంపిక చేసి ప్రజలకు అందిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మీడియా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. మీడియా విశ్వసనీయత ప్రశ్నార్థకం అయింది.
ఈరోజు పత్రికలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ లో నిన్నటి నుండి ఆదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడులు, చేసిన అరెస్టులకు సంబంధించిన వార్త “యాజమాన్య నియంత్రణ”కు బలయ్యింది. ఈ వార్తను కొన్ని పత్రికలు పూర్తిగా వదిలేయడం, కొన్ని పత్రికలు విస్తృతంగా ప్రచురించడం – రెండూ రాజకీయ, ఆర్ధిక, సామాజిక ప్రయోజనాలకోసమే తప్ప ప్రజా ప్రయోజనాలకోసం కాదని స్పష్టం అవుతోంది. ఏ “నియంత్రణ” కారణంగా ప్రజలు ప్రభుత్వ మీడియాను విస్మరించి పక్కకు వచ్చారో, అదే “నియంత్రణ” కారణంగా ఇప్పుడు ప్రైవేటు మీడియాను కూడా విస్మరించి “సోషల్ మీడియా”వైపు వస్తున్నారు. ఇప్పుడు ఎన్ని అనుమానాలున్నా, ఎన్ని ప్రస్నార్ధకాలున్నా సోషల్ మీడియాకే “విశ్వసనీయత” ఎక్కువగా కనిపిస్తోంది. మీడియా విశ్వసనీయత కోల్పోవడం దురదృష్టకరమే అయినా “ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం”లా ఉండవలసిన మీడియా “వ్యాపారానికి కీలక స్థంభం” అవడం బాధాకరం. కానీ చేయగలిగింది ఏమీ లేదు. ఏ “నియంత్రణ” లేని వార్తను ప్రజలు కోరుకుంటున్నారు. అది కొంతమేర సోషల్ మీడియాలో దొరుకుతోంది. అందుకే సోషల్ మీడియాలో “వార్త వైరల్ అవుతోంది. మీడియాలో వార్త తాటికాయంత అక్షరాల్లో పతాక శీర్షికలో వేసినా విశ్వాసం కోల్పోతోంది.
Written By Aditya for TeluguRajyam.com