బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, చిన్నారుల ఎదుట అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ హోంగార్డుపై కృష్ణా జిల్లా పోలీసు యంత్రాంగం కొరడా ఝుళిపించింది. ప్రైవేట్ వేడుకలో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు అజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అసలేం జరిగిందంటే? కృష్ణా జిల్లాలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న అజయ్ కుమార్ ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన డీజే పాటలకు ఓ యువతితో కలిసి చిన్నారుల ముందే హద్దులు మీరి ప్రవర్తించారు. అసభ్యకరమైన భంగిమలతో నృత్యం చేశారు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడున్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

సీరియస్ అయిన ఉన్నతాధికారులు పోలీసు శాఖలో పనిచేస్తూ, యూనిఫామ్ గౌరవాన్ని, శాఖ ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. తక్షణమే విచారణకు ఆదేశించారు. హోంగార్డు ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని నిర్ధారించి, అతడిని సస్పెండ్ చేశారు.
పోలీసు శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

