హోదా అడగం.. మూడు రాజధానులకు ఆడ్డుతగలొద్దు.. ఇదేనా డీల్ 

Big deal between State and Central governments
ఏపీలో తెర వెనుక రాజకీయాలు బాగా నడుస్తున్నాయి.  అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నాయనే అనుమానం కంగారు పెడుతోంది.  ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే ఆ కంగారే నిజమయ్యేలా ఉంది.  రాష్ట్రంలో అధికారంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో పాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీలు ఒక ఒప్పందం మీద వెళ్తున్నట్టుగా ఉన్నాయి.  ఈ రెండు పార్టీలు ఒకరి పట్ల ఒకరు వ్యవహరిస్తున్న వైఖరి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.  రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా, సంక్షేమ పథకాల పేరిట ఖజానాను ఖాళీ చేస్తున్నా, పొరపాటు నిర్ణయాలతో కోర్టుల్లో ఎదురుదెబ్బలు తింటున్నా ఏం మాట్లాడట్లేదు. 
 
పైగా స్వయంగా మోదీ వచ్చి శంఖుస్థాపనలో పాల్గొన్న, అన్ని విధాలా అండగా ఉంటామని మాటిచ్చిన రాజధాని అమరావతిని నిట్ట నిలువునా కూల్చేస్తున్నా కనీసం ఆరా తీసిన దాఖలాలు లేవు.  వేల మంది అమరావతి రైతులు అన్యాయమైపోతాం మొర్రో అంటూ 200 రోజులుగా దీక్షలు చేస్తున్నా కేంద్ర స్థాయిలో కనీస స్పందన లేదు.  ఏదో విమర్శలు చేయాలి కాబట్టి కరెంట్ రేట్ల మీద నిర్మలా సీతారామన్ తేలికపాటి చురక, అప్పుడప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ పాలన మీద లైట్ మోడ్లో విమర్శలు చేస్తున్నారు కానీ ఎక్కడా వైకాపా పాలన మీద, జగన్ నిర్ణయాల మీద బలమైన ఫోకస్ పెట్టట్లేదు.  
 
ఈ పద్దతి వెనుక కేంద్ర స్థాయిలో నాయకుల ఒప్పందం ఉన్నట్టుంది.  ఆ ఒప్పందమే స్పెషల్ స్టేటస్ అని అంటున్నారు.  2014 ఎన్నికల్లో మోదీ ఏపీకి ప్రత్యేక హోదా రూపంలో బాకీ పడ్డారు.  ఆ బాకీ తీరాలంటే చాలా తతంగం ఉంది.  ఏపీకి హోదా ఇవ్వాలంటే దేశ వ్యాప్తంగా చాలా సర్దుబాట్లు చేయాల్సి ఉంటుంది.  బోలెడంత మంది ప్రత్యర్థులను మేనేజ్ చేయాల్సి ఉంటుంది.  ఇవన్నీ చేయడానికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడే చేయని భాజపా ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల నడుమ చేయను గాక చేయదు.  అందుకే ఏపీ నుండి హోదా డిమాండ్ రాకుండా ఆపాలని అనుకుంది.  అందుకోసమే ఇక్కడి సర్కార్ తీసుకునే నిర్ణయాలకు మౌనంగా మద్దతిస్తోంది.  
 
ఇందుకు నిదర్శనమే అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా హోదా గురించి వైకాపా మాట్లాడకపోవడం.  22 మంది ఎంపీలున్నా కనీసం హోదా గురించి మోదీ దగ్గర ఇంతవరకు నోరెత్తలేదు.  హోదాతో కొత్త రాష్ట్రం స్థితి గతులు మెరుగుపర్చగల అవకాశం ఉన్నా అంతర్గత ఒప్పందాల కారణంగా ఆ డిమాండును తొక్కిపడేశారు.  హోదా వలన ఒరిగేదేమీ లేదని స్వయంగా వైకాపా నేతలే మాట్లాడారు.  ఈ ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో సైతం హోదా మీద మొదట్లో ఉన్నంత పంతం ఇప్పుడు లేదు.  హోదా మాటెత్తితే ఇంకెక్కడి హోదా అంటూ పెదవి విరుస్తున్నారు.  ఈ రకంగా పక్కా ప్లాన్ ప్రకారం హోదా ఆశలను కాలగర్భంలో కలిపేశారు.  
 
ఇక భాజపా వైకాపాకు చేస్తున్న ఫేవర్ మూడు రాజధానుల అంశంలో అడ్డుతగలకపోవడం.  వేల కోట్లు పోసి, వేల మంది రైతుల నుండి భూములు తీసుకుని గత ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న రాజధానిని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆపుచేయడం అంటే మామూలు విషయం కాదు.  ఆ ప్రక్రియ వెనుక కేంద్ర ప్రభుత్వం మద్దతు లేకుండా ఆ పని సాధ్యం కాదు.  అలాగే ఇంతవరకు దేశ చరిత్రలో చూడని విధంగా ఒక రాష్ట్రానికి మూడు రాజధానులనే నిర్ణయం కత్తి మీద సాము లాంటిది.  ఏమాత్రం పొరపాటు జరిగినా కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది.  ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రమాదకర నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయడం కోసం ధన నష్టాన్ని, ప్రజల వ్యథల్ని పట్టించుకోకుండా ముందుకు వేళుతోందంటే వెనుక పెద్ద శక్తుల అండ తప్పకుండా ఉండి తీరాలి. 
 
మరి ఆ శక్తి భారతీయ జనతా పార్టీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  బీజేపీ ఇంతవరకు మూడు రాజధానుల మీద జగన్ ప్రభుత్వాన్ని కార్యాచరణ ఎలా ఉంటుంది, సత్పలితాలకు భరోసా ఏమిటి, ఏ నమ్మకంతో ఈ పద్దతిని ఫాలో అవుతున్నారు, విజయవంతం అయ్యే ఆస్కారం ఎంత అనే కనీస వివరణ కోరలేదు.  ఇది చూసీచూడనట్టు వెళ్ళే ఉద్దేశ్యపూర్వక ధోరణే.  సో.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒక పరస్పర అవగాహనతో రాజకీయం చేస్తున్నాయని అర్థమవుతోంది.  కానీ ఆ అవగాహన రాష్ట్రానికి మంచి చేసేదా లేక నష్టం చేసేదా అనేదే అర్థం చేసుకోవాల్సిన విషయం.