దిశ అత్యాచారం–హత్య కేసు నేరస్థులను ఎన్కౌంటర్లో కాల్చివేయడం పట్ల దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్లతో మహిళలపై అత్యాచారాలు ఆగిపోతాయా ? లేదా తగ్గిపోతాయా ? మహిళలు ఇక సమాజంలో స్వేచ్చగా తిరుగుతారా? వారి భద్రతకు ఎవరు భరోసా ఇస్తారు అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. గతంలో మహిళలపై జరిగిన సంఘటనలను కూడా చూస్తే ఇలాంటి నిరసనలే ఉత్పన్నమైయ్యాయి. తద్వారా షరామామూలే. దిశ సంఘటనతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనికి తోడు శుక్రవారం తెల్లవారు జామున నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దీంతో రాష్ట్ర పోలీసులను ఆకాశానికి ఎత్తారు. ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది. సమాజంలో ఇలాంటి ఎన్ కౌంటర్లను ప్రోత్సహిద్దామా? ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు ఎంత వరకూ ప్రోత్సహించగలమనే సందేహలు కూడా వస్తున్నాయి.
ఇకపోతే 2012వ సంవత్సరం డిసెంబర్ 16న ఢిల్లీ పారా మెడికల్ స్టూడెంట్ను ఢిల్లీ పరిసరాల్లో నిర్భయ (జ్యోతి సింగ్) పాండే ను గ్యాంగ్ రేప్ చేసి చంపినప్పుడు కూడా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ఇప్పటిలాగే ఆందోళన వ్యక్తమైంది. నేరస్థులకు ఉరిశిక్ష విధించాలంటూ, అందుకు కఠిన చట్టాలు తీసుకురావాలంటూ ప్రజా ఉద్యమాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఫలితంగా ‘క్రిమినల్ లా (అమెండ్మెంట్) యాక్ట్–2013’ను తీసుకొచ్చారు. అప్పటి వరకు రేప్ కేసుల్లో దోషులకు గరిష్టంగా ఏడేళ్లే జైలు శిక్ష విధించే అవకాశం ఉండేది. కాని ఒక్కసారిగా దాన్ని 20 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. 2015లో ‘జువెనైల్ జస్టిస్ యాక్ట్’లో సవరణలు తీసుకొచ్చారు. తద్వారా 16 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు మైనర్లను హత్యా, రేప్ కేసుల్లో పెద్ద వాళ్లలాగానే విచారించి, శిక్షించే అవకాశం లభించింది.
2018లో 12 ఏళ్ల లోపు మైనర్లను రేప్ చేసినట్లయితే వారికి మరణ శిక్ష విధిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో చట్టాన్ని తీసుకొచ్చింది. ఒక రకంగా మహిళల రక్షణ కోసం చట్టాలకు ప్రభుత్వం పదునుపెట్టింది. కానీ ‘నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో’ లెక్కల ప్రకారం 2012లో దేశవ్యాప్తంగా 25 వేలకన్నా తక్కువ రేప్ కేసులు నమోదయ్యాయి. 2013లో వాటి సంఖ్య 33,707, 2016లో 38,947లకు సంఖ్య పెరిగింది. దీన్నిబట్టి ప్రతి ఏటా రేప్ లు పెరుగుతున్నాయి. వాస్తవానికి రేప్ కేసుల సంఖ్య 2013 నుంచి పెరిగాయి. కానీ కేసులు కూడా అదే స్థాయిలో పెండింగులో ఉన్నాయి. ఈ కేసుల్లో నేరస్థులకు ఇప్పటి వరకు 25 నుంచి 30 శాతం వరకూ శిక్ష పడినట్లు లెక్కలు చెబుతున్నాయి.
రేప్ కేసులను వేగంగా విచారించేందుకు దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పలుమార్లు వెల్లడించింది. కానీ ఇప్పటి వరకు 664 కోర్టులనే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నది. మరో 1023 కోర్టులను ఏర్పాటు చేస్తామని ఇటీవలే ప్రకటించింది. రేప్ కేసులకు కఠిన చట్టాలను తీసుకరావడం వల్ల గతంలో బాధితులను ప్రాణాలతో వదిలేసే వారని, ఇప్పుడు సాక్ష్యాధారాలను కనుమరుగు చేయడంలో భాగంగా బాధితులను పెట్రోలు లేదా కిరోసిన్ పోసి తగులబెడుతున్నారని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కరికీ విద్య అనేది తప్పనిసరి చేస్తూ, సమాజం, చట్టాలపై అవగాహన తీసుకురావడం వల్ల కొంతైనా మార్పు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.