దేశంలో ఈ రోజు మహారాష్ట్ర, తెలంగాణలో రెండు చోట్ల మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో మొత్తం ఏడుగురు చనిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరౌలిలో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. తెలంగాణలో జరిగిన ఎన్ కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ‘మావోయిస్టు పార్టీ తెలంగాణలో విధ్వంసం సృష్టించడానికి చాలా యాక్షన్ టీంలను, మావోయిస్టు దళాలను చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలకు పంపించినట్లుగా సమాచారం అందింది.
ప్రభుత్వ ఆస్తులను, పోలీసులపై దాడి చేయడానికి వ్యూహరచన చేసుకున్నట్లు సమాచారం ఉంది. ఈ సమాచారం మేరకు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట అటవీ ప్రాంతాల్లో ములుగు జిల్లా ప్రత్యేక బలగాలు, గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ ను నిర్వహించాం. మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసలమ్మ గుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరు మగ మావోయిస్టులు మరణించారు. తాడువాయి, పసర , మంగపేట తదితర ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టులు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూనే ఉంటారు.’ అని ములుగు ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇక మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో ఉన్న కోస్మి – కిస్నేలి అటవీ ప్రాంతంలో 4 గంటల ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్టు గడ్చిరౌలి ఎస్పీ తెలిపారు. సీ – 60 కమాండోలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఏడాది జరిగిన ఎన్ కౌంటర్లలో ఇదే పెద్దదని చెబుతున్నారు. ఈ ఎన్ కౌంటర్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు సహా ఐదుగురు చనిపోయారు. ‘గడ్చిరౌలి పోలీస్‌కి చెందిన సీ- 60 కమాండోలు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ధనోరా తాలూకాలో నక్సల్స్ కాల్పులు జరిపారు. దీంతో వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. వెంటనే మావోయిస్టులు పారిపోయారు. కొంతసేపటి తర్వాత ఘటన స్థలాన్ని పరిశీలించగా, ఐదు మృతదేహాలు లభించాయి. చనిపోయిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఎదురుకాల్పుల తర్వాత పోలీసులు కూంబింగ్ మరింత ఉధృతం చేశారు.’ అని ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలియచేసింది.