తెలంగాణ మంత్రిని ఏడ్పించిన జవాను వీరమరణం

జమ్మూకాశ్మీర్ లోని నియంత్రంరేఖ వద్ద తీవ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు తెలుగు జవాన్లు వీరమరణం చెందిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కొమన్ పల్లికి చెందిన ర్యాడా మహేష్ అమరులైన విషయం తెలిసిందే.

నిజామాబాద్ జిల్లోని తన స్వగ్రామం వేల్పూర్ కు సమీపంలోనే ఉన్న కొమన్ పల్లికే చెందిన కేవలం ఓ 26 ఏళ్ల యువకుడు దేశరక్షణలో వీరమరణం చెందాడన్న విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి తెలంగాణ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి హుటాహుటిన మహేష్ స్వగ్రామానికి చెరుకున్నారు. పరామర్శించేందుకు వచ్చిన ఈయన.. మహేష్ కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. ఆయన కళ్లు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. ఓ వీరజవాను ఇంట్లో ఉండే ఉద్విగ్న వాతావరణమే మంత్రిని ఏడ్పించింది. మహేష్ తల్లిదండ్రులను పరామర్శించే క్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డినే కన్నీళ్లు పెట్టుకున్నారు. మహేష్ తల్లిదండ్రులతో అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మంత్రిగారికి. వారికి ఎలా సర్ధి చెప్పాలో కూడా అర్థం కాలేదు అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రికి.

అసెంబ్లీలో ప్రతిపక్షాలు సంధించే అస్త్రాలకు ధీటుగా స్పందించే మంత్రికి ఇక్కడ మాత్రం  కనీసం నోట మాట కూడా రాలేదు. చివరకు బరువెక్కిన గుండెతో, చెమ్మగల్లిన కళ్లతో ఇంట్లోంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆతర్వాత కాసేపటికి తేరుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. చదువుల్లో మంచి ప్రతిభ కనబర్చే మహేష్ కు ఎన్నో ఉద్యోగాలు వచ్చినా… సైన్యంలో చేరాలన్న ఏకైక సంకల్పంతో అన్నింటినీ కాదని ఇండియన్ ఆర్మీలో చేరాడన్న విషయం  తెలుసుకొన్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున పరామర్శించేందుకు వెళ్ళిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, కలెక్టర్ నారాయణ రెడ్డి తో కూడిన బృందానికి నోట మాట రాలేదు. ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో కాకుండా కేవలం దేశరక్షణ అన్న ఏకైక లక్ష్యంతో అత్యంత కఠినమైన కెరీర్ ను ఎంచుకోవడం…కేవలం 26 ఏళ్ల ప్రాయంలోనే శత్రుతూటాలకు బలికావడం అందర్ని కలచివేసింది. దీనికి తోడు మహేష్ కు రెండేళ్ల కిందటే పెళ్లైందన్న విషయం అందర్ని మరింత క్షోభ పెట్టింది.

మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. మహేష్ వెలకట్టలేని త్యాగానికి ప్రతీకగా…. రాష్ట్ర ప్రభుత్వ, సైనిక లాంఛనాల మధ్య ఆయన అంతిమ సంస్కారాలు  జరిపిస్తామని చెప్పారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా జరగాల్సిన అన్ని రకాల ఫార్మాలిటీస్ వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

మద్యం పోసి కరెన్సీ నోట్లు జేబులో పెట్టినా ఓటు వేస్తారో లేదో గ్యారెంటీ లేని ఈరోజుల్లో… తన స్వగ్రామానికి సమీపంలోనే ఉన్న ఓ మామూలు పల్లెటూరులో ఇంత కమిటెడ్ సోల్జర్ ఉండడం మంత్రిని ఉక్కిరి బిక్కిరి చేసిందట. పొద్దున లేచింది మొదలు తేరగా ఏద దొరుకుతుందా అని అన్వేషించే కార్యకర్తలు, నాయకులు ఒకవైపు…తమ కంఫర్ట్ జోన్ చూసుకొని అందులోంచే పని చేసే అధికారులు ఇంకో వైపు, ఏ పని చేసినా నాకేంటి అని అడిగే కాంట్రాక్టర్లు మరోవైపు ఇలా వీరందరి  సహవాసంలో ఉండే రోడ్లుభవనాలు, అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి గారికి … ఒక్కసారిగా ఇలాంటి సిట్యువేషన్ ఎదురుకావడంతో ఏం మాట్లాడాలో కూడా పాలుపోక కన్నీరు పెట్టారట. ఈ పరిణామం ఆయనతో పాటు ఆయన వెంట వచ్చిన అధికారుల్లో  ఎంతో కొంత స్పూర్తిని రాజేసే ఉంటుంది అని అంటున్నారు స్థానికులు.