జస్టిస్ ఫర్ చైత్ర.. ఆ తర్వాతేంటి.?

ఓ నిర్భయ.. ఓ దిశ.. అంతకు ముందు, ఆ తర్వాత.. చాలానే జరిగాయ్.. జరుగుతూనే వున్నాయ్. ఎంతోమంది మహిళలు, మృగాళ్ళ అఘాయిత్యాలకు బలైపోతున్నారు. నెలల చిన్నారి.. కాటికి కాలు చాపిన వృద్ధురాలు.. ఎవరూ అతీతం కాకుండా పోయారు మృగాళ్ళ కీచకపర్వానికి. అసలేం జరుగుతోంది ఈ పవిత్ర భారతావనిలో. ఆయా ఘటనల్లో దోషులకు కొన్నిసార్లు శిక్షలు పడుతున్నాయి.. చాలామంది మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. సమస్య ఏంటన్నది అందరికీ తెలుసు.. కానీ, పరిష్కారమే దొరకడంలేదు. కాస్త లేటుగా, ‘జస్టిస్ ఫర్ చైత్ర’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.. రాజకీయ నాయకులూ మాట్లాడుతున్నారు.. కానీ, ఓ చిన్నారిపై హత్యాచారం జరిగితే.. స్పందించడానికి ఇంత ఆలస్యమా.? నిందితుడెవరో తెలిసింది.. కానీ, ఆ తెలిసే లోపు.. నిందితుడు పారిపోయాడు.

నిందితుడి ఫొటో, పేరు, మిగతా వివరాలు పోలీసులు తాపీగా వెల్లడించారు. వాడ్ని పట్టుకునేందుకు సోషల్ మీడియా ఉద్యమిస్తోంది. దొరుకుతాడు.. ఖచ్చితంగా దొరుకుతాడు. దిశ ఘటనలో జరిగినట్లు ఇక్కడా ఎన్‌కౌంటర్ జరుగుతుందా.? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్సే. తప్పదు, ఇలాంటి ఘటనల్లో ఎన్‌కౌంటర్ ఒక్కటే మార్గం. కానీ, ఆ ఎన్‌కౌంటర్ భయం ఎన్నాళ్ళుంటుంది మృగాళ్ళలో.? దిశ తర్వాత చైత్ర ఘటన ఎందుకు జరిగింది.? మధ్యలో ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరిగాయి తెలంగాణలో.? ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి.? తన కుమార్తెను మృగాళ్ళు హత్యాచారం చేశారంటూ సుగాలి ప్రీతి తల్లి నేటికీ న్యాయం కోసం పోరాడుతూనే వుంది. న్యాయం కోసం వేచి చూస్తోన్న కుటుంబాలు ఎన్నో వున్నాయి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా. ప్రభుత్వాలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తేనో, పోలీసులు ఎన్‌కౌంటర్లు చేసేస్తోనో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకోలేం. నేరం చెయ్యాలంటేనే మృగాళ్ళు భయపడాలి.. ఆ పరిస్తితి రావాలి. అలా జరగాలంటే ముందు పాలకుల్లో చిత్తశుద్ధి వుండాలి.