Sudigaali Sudheer: సుధీర్ స్కిట్ లో మెగాస్టార్ సీన్.. అనుకోని వివాదం!

టెలివిజన్ యాంకర్‌గా పేరు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్, అప్పుడప్పుడూ హీరోగా నటిస్తూ ఫ్యాన్ బేస్ పెంచుకుంటున్నాడు. తాజాగా ఓ రియాలిటీ షోలో అతను చేసిన స్కిట్ పెద్ద వివాదానికి దారితీసింది. 1998లో చిరంజీవి నటించిన “బావగారు బాగున్నారా” సినిమాలోని సీన్‌ను సుధీర్, రంభ గెస్ట్‌గా వచ్చిన ఎపిసోడ్‌లో రీక్రియేట్ చేశాడు. నంది కొమ్ముల మధ్య నుంచి రంభ దర్శనం ఇవ్వడం ఆ సీన్‌లో హైలైట్‌గా చూపారు. యాజిటీజ్ మాదిరిగానే డైలాగ్స్‌ కూడా వినిపించడంతో, నెటిజన్లలో కలకలం రేగింది.

ఈ స్కిట్‌కి హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. నంది విగ్రహాన్ని మధ్యలో పెట్టి కామెడీ చేయడం అనైతికమని విమర్శలు వచ్చాయి. చిరంజీవి అదే సీన్ చేసేటప్పుడు ఎలాంటి రివర్స్ రియాక్షన్స్ రాకపోవడం, ఇప్పుడు మాత్రం పెద్ద వివాదానికి దారితీస్తుందంటే కారణం మారిన కాలం అని పలువురు విశ్లేషిస్తున్నారు. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం, మెగాస్టార్ చేయడం వల్ల స్వీకరించగలిగిన దృశ్యమైపోయింది. కానీ కామెడీ ఆర్టిస్ట్ సుధీర్ చేసే సరికి, దానిపై ఆగ్రహం పెరిగింది.

వాస్తవానికి, ఆ ఒరిజినల్ సీన్‌కు కథతో సంబంధం ఉంది. దేవాలయంలో హీరో-హీరోయిన్ కలుసుకునే సందర్భానికి నంది విగ్రహం సహజంగా కుదిరింది. పరుచూరి బ్రదర్స్ రాసిన సన్నివేశాన్ని జయంత్ పరాంజీ సున్నితంగా తెరకెక్కించారు. కానీ ఇప్పుడు అదే సీన్‌ను వేదికపైన రిపీట్ చేయడం సందర్భోచితంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్కిట్‌లో అలాంటి ప్రతీకను వాడటానికి తప్పనిసరి అవసరం లేకపోవడంతో అసహనం వ్యక్తమవుతోంది.