Sai Abhyankkar: మ్యూజిక్ డైరెక్టర్లకి పేరొచ్చేది వాళ్లు కంపోజ్ చేసిన తొలి ఆల్బమ్ హిట్ అయితేనే. కానీ ఒక్క ఫుల్ లెంగ్త్ సినిమా కూడా రాకముందే సాయి అభ్యంకర్ అనే పేరు ఇండస్ట్రీ మొత్తాన్ని ఊపేస్తోంది. కేవలం యూట్యూబ్ ఆల్బమ్స్ ద్వారానే పాపులర్ అయ్యిన ఈ యువ టాలెంట్‌కి ఇప్పుడు ప్యాన్ ఇండియా ప్రాజెక్టుల వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇంకా అనౌన్స్ చేయని అప్డేట్ ప్రకారం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్‌లో రూపొందే భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాకు సాయి అభ్యంకరే మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయనున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమాకంటే ముందు ఏఆర్ రెహమాన్ వదిలేసిన సూర్య 45 ప్రాజెక్ట్ కూడా ఈ యువ సంగీత దర్శకుడి ఖాతాలో పడిపోయిందట. లారెన్స్ హీరోగా, లోకేష్ కనగరాజ్ కథతో రూపొందుతున్న బెంజ్, ప్రదీప్ రంగనాధన్-మైత్రి మూవీ మేకర్స్ కాంబోలో తెరకెక్కనున్న ప్రాజెక్ట్, అలాగే శింబు 49వ సినిమా… ఇవన్నీ సాయి అభ్యంకర్ చేతికి చేరిన అవకాశాలే. ఒక్కసారిగా ఈ స్థాయిలో క్రేజ్ రావడం మ్యూజిక్ లవర్స్‌కి సర్‌ప్రైజ్‌గా మారింది. ప్రస్తుతం వచ్చిన పెద్ద ప్రాజెక్టులు చూసి అతడే కొన్ని సినిమాలు తాను హ్యాండిల్ చేయలేనని పెండింగ్‌లో ఉంచినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ రేంజ్‌లో క్రేజ్ రావడానికి కారణం సాయి అభ్యంకర్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్‌నే. యూట్యూబ్‌లో అతను రూపొందించిన పాటలు యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి. వందల మిలియన్ల వ్యూస్ సంపాదించిన ఈ పాటలవల్లే అతని క్రేజ్ ఇండస్ట్రీకి అందింది. మరోవైపు తల్లి హరిణి, తండ్రి టిప్పు టాప్ ప్లేబ్యాక్ సింగర్స్ కావడం వల్ల సంగీతం పట్ల ఉన్న పరిజ్ఞానం, ఇంటి నుంచి వచ్చిన వారసత్వమే ఈ టాలెంట్‌కు ముడి కట్టిందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఈ నామాన్ని నిలబెట్టుకోవడం, ఆ స్థాయిని కొనసాగించడం సాయి అభ్యంకర్ ముందు ఉన్న సవాలు. ఇండస్ట్రీకి ఓ కొత్త, ఫ్రెష్ మ్యూజిక్ సెన్సేషన్ రావడం ఖాయం అనిపిస్తోంది. ఇప్పుడు టాక్ మొత్తం అతనిపైనే ఉంది. ఇక అసలు టాలెంట్ తెరపై ఎలా మెరిసిపోతుందో వేచి చూడాలి.