జగన్మోహన్ రెడ్డి ధాటికి చెల్లాచెదురైన తెలుగుదేశం పార్టీ!

jagan-mohan-reddy,TDP

jagan-mohan-reddy,TDP

నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా అన్నట్లు తమది నలభై ఏళ్ల పార్టీ అని, పునాదులు పటిష్టంగా ఉన్నాయని, గెలిచినా, ఓడినా ముప్ఫయి అయిదు నుంచి నలభై శాతం వరకు తమకు ఓటు బ్యాంకు ఉన్నదని, బీసీలంతా తమవైపే ఉన్నారని భావిస్తూ ఇరవై రెండేళ్లపాటు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన తెలుగుదేశం పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి రూపంలో తాకిన ప్రళయభీకర సునామీకి కకావికలై చిరునామా కూడా లేకుండా పోవడం ఆశ్చర్యమే.

నిజానికి తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కన్నా పచ్చ మీడియా హైప్ చేసిచూపించే బలమే అధికం. వాపును బలంగా భ్రమించిన తెలుగుదేశం అసలు బలం ఏమిటో పంచాయితీ ఎన్నికలు, ప్రస్తుతం జరుగుతున్న పురపాలిక ఎన్నికల్లో బయటపడింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటినుంచీ ఎవరో ఒకరి పొత్తుతోనే ఎన్నికల్లో పోటీచేస్తున్నది. చంద్రబాబువిషకౌగిట్లొకి తెలుగుదేశం చేరాక జాతీయ రాజకీయాల్లో ఎవరి ప్రభావం ఎక్కువగా కనిపిస్తే వారి కాళ్ళమీద పడటం, వారితో పొత్తుకు ఒప్పించడం, అవసరం అనుకుంటే దోచుకున్న ప్రజాసంపదనుంచి వందలకోట్ల రూపాయలు ఇతర పార్టీలకు ఎన్నికల ఖర్చు కోసం సర్దుబాటు చెయ్యడం, అవతలివారి అవసరం లేదనుకుంటే కుక్క మీద పిచ్చిది అని ముద్రవేసి చంపినట్లు మిత్రపార్టీల నాయకుల మీద నిందలు వెయ్యడం, వారితో బంధాలను తెచ్చుకోవడం, అప్పటివరకు తాము తిట్టిపోసిన పార్టీతో నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకోవడం లాంటి మానహీనమైన కార్యాలకు తెగించింది. ఆ తెగింపులో భాగంగానే ఇప్పటివరకు కొన్నాళ్ళు బీజేపీ, కొన్నాళ్ళు కమ్యూనిస్టులు, కొన్నాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జనసమితి, కొన్నాళ్ళు జనసేన, మళ్ళీ బీజేపీ, పార్టీలతో పొత్తు పెట్టుకోవడమే వింత అనుకుంటే చంద్రబాబు నిస్సిగ్గుతనానికి పరాకాష్టగా కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్నది తెలుగుదేశం!

వారితో పొత్తు కలిసొచ్చి విజయాలు సాధించగానే వారిని కరివేపాకులా తీసిపారేయడమే కాక, ప్రధానమంత్రి లాంటివాడిని సైతం అసభ్యపదజాలంతో దూషించడం, కేంద్రంలో అధికారపార్టీ అధ్యక్షుడి మీదనే రాళ్లవర్షం కురిపించడం, వారిని రాష్ట్రంలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడం లాంటి నికృష్టచర్యలకు పాల్పడటానికి కూడా తెలుగుదేశం వెనుకాడలేదు.

2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు మోడీ, పవన్ కళ్యాణ్ ల ప్రభావం వల్లనే సాధ్యం అయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చేనాటికి వారిద్దరితో మైత్రిని తెంచుకున్నారు ఆయన. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఎవ్వరూ విశ్వసించలేదు. దాంతో ఒంటరిగా పోటీ చేయాల్సివచ్చింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం ఇరవై మూడు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. మొదటి ఎన్నికల్లో కేవలం ఒకటిన్నర శాతం ఓటింగ్ తో అధికారాన్ని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి తరువాతి ఎన్నికల్లో దాదాపు పదిశాతం అధిక ఓటింగ్ తో అధికారాన్ని కైవసం చేసుకుని, ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం అసలు బలం ఏమిటో చాటిచెప్పారు!

పంచాయితీ ఎన్నికల్లో కేవలం పదిహేను శాతం స్థానాలు మాత్రమే దక్కించుకుని పరువును నిలువుగా పోగొట్టుకున్న తెలుగుదేశం నిన్నటి మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అభ్యర్థులు కూడా దొరక్క తెల్లముఖం వేసింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూర్ మునిసిపాలిటీ కూడా వైసిపి ఖాతాలో పడింది. పిడుగురాళ్ల, మాచర్ల లాంటి పల్నాడులోని బలమైన మునిసిపాలిటీలు కూడా ఏకపక్షంగా వైసీపీ గెల్చుకుంది. పుంగనూరు కూడా పోటీలేకుండానే వైసిపి విజేత అయింది. డెబ్బై ఐదుకు గాను డజను మునిసిపాలిటీలు ఏకగ్రీవంగా వైసిపి కైవసం చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ మళ్ళీ కోలుకునే ఆశలే లేవు. వచ్చే ఎన్నికల నాటికి అసలు ఆ పార్టీ ఉనికినే కోల్పోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు!

కారణం ఒక్క ముక్కలో చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరుగులేని విశ్వసనీయతను సాధించారు. చంద్రబాబుకు అసలు విశ్వసనీయత లేదని మరోసారి రుజువైంది! దట్సాల్!