ధర్మ బోధన, నైతిక విలువలపై శిక్షణ

మన సమాజంలోని ధర్మశాస్త్రాలు, నైతిక విలువలపై విద్యార్ధుల్లో అవగాహన కల్పించేందుకు, చైతన్యం తెచ్చేందుకు తిరుమల తిరపతి దేవస్ధానం శుభప్రదం అనే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీ నుండి జూన్ 2వ తేదీ వరకూ నిర్వహిస్తుంది.  

ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వరస్వామి జీవిత చరిత్ర,  భగవద్గీత, సనాతన ధర్మ పరిచయం, రామాయణ, భాగవత, మహాభారత సారంశం, ఆర్ష వాజ్ఞ్మయం, వ్యక్తిత్వ వికాశం, భారతీయ కుటుంబ జీవనం, మాతృభాష, దేశభక్తి తదితర అంశాలపై విద్యార్ధులకు అవగాహన కలిగే బోధనలుంటాయి.

తిరుపతి కేంద్రంగా జరిగే పై కార్యక్రమంలో 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్ధిని, విద్యార్ధులను తీసుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 3500 మందికి ప్రవేశం కల్పించాలని టిటిడి నిర్ణయించింది. విద్యార్ధినీ, విద్యార్ధులకు వేర్వేరుగా శిక్షణ శిబిరాలుంటాయి. అలాగే బస కూడా వేర్వేరుగానే టిటిడి ఏర్పాటు చేసింది.

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనదలచిన వాళ్ళు టిటిడి వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని టిటిడి చెప్పింది. తిరుపతి చుట్టుపక్కలున్న విద్యార్ధినీ విద్యార్ధులైతే అన్నమాచార్య కళామందిరంలోని ధర్మప్రచార ప్రోగ్రాం  కో ఆర్డినేటర్ కు దరఖాస్తు అందించాల్సుంటుందని టిటిడి ప్రకటించింది.