తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలను టీటీడీ తీవ్రంగా పరిగణించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, గౌడ్‌పై అధికారిక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎంతటివారైనా అంగీకారము కాదని టీటీడీ స్పష్టం చేసింది.
తిరుమల కొండపై రాజకీయ విమర్శలను పాలకమండలి ఎప్పటినుంచో నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు ఈ నిబంధనలకు విరుద్ధమని టీటీడీ అభిప్రాయపడింది. క్షేత్ర పవిత్రతను కాపాడటంలో పాలకమండలి వెనుకడుగు వేయదని బీఆర్ నాయుడు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పదని తేల్చిచెప్పారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ భక్తులు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలను సమానంగా చూడాలని, వారికి అందజేసే సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తిరుమలలో ఆంధ్రా ప్రజలు లబ్ధి పొందుతున్నారని, కానీ తెలంగాణవారికి అన్యాయం జరుగుతోందని గౌడ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీటీడీ స్పందనతో శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యల ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ పరిణామం రాజకీయంగా ఎలా మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.