Tirumala: తిరుమలలో పొలిటికల్ కామెంట్స్ చేసిన మాజీమంత్రి…. చర్యలకు ఆదేశించిన టీటీడీ చైర్మన్!

Tirumala: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ చైర్మన్ గా బి.ఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయ ప్రతిష్టతను కాపాడటం కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా తిరుమలకు వచ్చే ఏ రాజకీయ నాయకుడైన సినిమా సెలబ్రిటీలు అయిన స్వామివారిని దర్శించుకుని వెళ్లాలి తప్ప రాజకీయాల గురించి మాట్లాడకూడదని తెలిపారు.

ఇలా రాజకీయాల గురించి మాట్లాడుతూ స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించకూడదని ఆదేశాలను జారీ చేశారు. అప్పటినుంచి ఏ రాజకీయ నాయకుడు తిరుమల కొండకు వెళ్లిన రాజకీయాల గురించి మాట్లాడటం లేదు అయితే ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. ఇకపోతే తాజాగా తిరుమల ఆలయానికి వెళ్లినటువంటి తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

తిరుమలలో తెలంగాణ భక్తులపై పూర్తిస్థాయిలో వివక్షత చూపుతున్నారని తెలిపారు.తెలుగు రాష్ట్రాలు విడిపోయినా స్వామి వారు అందరికీ చెందిన వాడని తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డ స్వామి వారిని దర్శించుకుని తలనీలాలు అర్పిస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా తిరుమలలో తెలంగాణ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని, వైసీపీ ప్రభుత్వ హాయామంలో కూడా ఎలాంటి వివక్షత చూపలేదని తెలిపారు.

ఇక ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం తిరుమల ఆలయంలో తెలంగాణ భక్తుల పట్ల వివక్షత చూపుతుందని ఈయన మండిపడ్డారు.సాధారణ ప్రజలతో పాటు, రాజకీయ, వ్యాపార వేత్తల విషయంలో వివక్ష కొనసాగుతోందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు
ఈ విధంగా ఈయన తిరుమల ఆలయం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బి.ఆర్ నాయుడు ఈయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలను జారీ చేశారు.