కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణం ప్రభుత్వమేనా

కొండగట్టులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్టీసి లోపం వల్ల జరిగిన ఈ తప్పుకు డిపో మేనేజర్ పై సస్పెన్షన్ వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని పలువురు విమర్శిస్తున్నారు. వేటు వేయగానే సరిపోయిందా మళ్లీ ఈ తప్పులు జరగకుండా ఉండాలంటే చేపట్టాల్సిన చర్యల గురించి ఆలోచించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 57 నిండు ప్రాణాలు బలయ్యాయని ఈ ప్రమాదానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఆర్టీసి బస్సులలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పాత బస్సులను ఉపయోగించడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్స్ ప్రెస్ బస్సులుగా సర్వీసు అయిపోయిన బస్సులను పల్లె వెలుగులుగా మార్చి వాడుతున్నారు. అలాగే డ్రైవర్లను కూడా సమయానికి మించి పనిచేయించడంతో వారు ఒత్తిడికి గురవుతున్నారు. అసలే కండీషన్ లేని బస్సులు ఓవర్ లోడ్ ఉన్నా స్టాపుల దగ్గర ఆపకపోతే చర్యలు తప్పవనే ఉద్దేశ్యంతో బస్సులను ఆపి అధిక మంది ప్రయాణికులను ఎక్కించుకోక తప్పని పరిస్థితి. దీంతో డ్రైవర్తు ఒత్తిడికి గురవుతున్నారు. 8 గంటలు పనిచేయాల్సింది పోయి 10-16 గంటల వరకు ఒకరోజు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్రైవర్ల కొరతతో వారికి సెలవులు కూడా ఉండవు. వీకాఫ్ లు కూడా పెట్టుకోలేని పరిస్థితి ఉందని ఆర్టీసీ డ్రైవర్లు చెబుతున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం వీడియో చూడటానికి కింద లింక్ పై క్లిక్ చేయండి.

 

వీడియో కోసం దీని పై  క్లిక్ చేfacebook.com/…dpsp/videos/321103715330816యండి. 

బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ శ్రీనివాస్ సోమవారం 16 గంటల పాటు పనిచేశాడని, శని, ఆది వారాలు కూడా సమయానికి మించి పనిచేశాడని తోటి సిబ్బంది తెలిపారు. మంగళవారం ఉదయం వెంటనే డ్యూటికి అధికారులు రమ్మని చెప్పినా శ్రీనివాస్ బస్సు కండీషన్ లో లేదని, పని ఒత్తిడితో రానని చెప్పాడు. కుటుంబసభ్యులు సర్ది చెప్పడంతో శ్రీనివాస్ డ్యూటికి వెళ్లాడు. ప్రమాదానికి గురైన బస్సు ఎక్స్ ప్రెస్ సర్వీస్ గా 14 లక్షల కిలో మీటర్లు తిరిగింది. వాస్తవానికి ఆ బస్సు ప్రయాణానికి పనికి రాదు. కానీ దానిని పల్లె వెలుగుగా మార్చి అధికారులు సర్వీసు అందిస్తున్నారు. అధిక ఒత్తిడి, ఆక్యుపెన్సీ రేషియోలో అధికారుల టార్గెట్లతో డ్రైవర్లకు మానసికంగా చాలా ఒత్తిడి ఉంటుందని తెలుస్తోంది.

పట్టణాలలో తిరిగే బస్సులకు 8 గంటల సర్వీసు మాత్రమే ఉంటుంది. రెండు షిఫ్టులుగా బస్సులు పనిచేస్తుంటాయి. మరికొన్ని జనరల్ సర్వీసును అందిస్తాయి. జిల్లా ప్రాంతాలలోని డిపోల బస్సులకు మాత్రం ట్రిప్పుల వైజుగా, కిలోమీటర్ల టార్గెట్ తో బస్సులు నడిపిస్తారు. టైం అనేది ఉండదు. వారంలో ఒక రోజు వీకాఫ్ లభిస్తుంది. ఆర్టీసీలో చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. డ్రైవర్ల పోస్టులు, కండక్టర్ల పోస్టులు చాలా ఖాళీలు ఉన్నాయి. బస్సులు నడపడానికి 2:6 నిష్పత్తిలో డ్రైవర్లు ఉండాలి. కానీ చాలా డిపోల్లో డ్రైవర్లు అందుబాటులో లేరు. డబుల్ డ్యూటిలు, ఓవర్ టైమ్ ల వల్ల డ్రైవర్లకు విశ్రాంతి లభించడం లేదు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు బస్సుల సంఖ్య 13,556గా ఉంది. 2018 మార్చికల్లా 18,234 బస్సులు ఉన్నాయి. బస్సులను సమకూర్చుకున్నా అందులో అధికంగా ప్రైవేటు బస్సులే ఉన్నాయి. ఉద్యోగులు కూడా లేరు. ఉన్నవారితోనే డబుల్ పనిచేయించి కాలం వెళ్లదీస్తున్నారు.

ఉత్తమ డ్రైవర్ గా అవార్డు అందుకుంటున్న బస్సు డ్రైవర్ శ్రీనివాస్

కొండగట్టు ప్రమాదానికి ప్రభుత్వమే కారణమని విపక్షాలు అంటున్నాయి. మార్పు తీసుకొస్తామని గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మార్పు ఇదేనా అని విమర్శించారు. రవాణాకు అనుగుణంగా బస్సులను కొనుగోలు చేసి ప్రజలకు క్షేమకరమైన ప్రయాణాన్ని అందించాలని వారు కోరారు. అవసరమైన సిబ్బందిని నియమించి ఉన్నవారికి పని ఒత్తిడి తగ్గించాలని కోరుతున్నారు. కేవలం డిఎంని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు.