దేశ ఆర్టీసీ చరిత్రలోనే జరగనటువంటి ఘోర రోడ్డు ప్రమాదం కొండగట్టులో జరిగింది. ఆ ప్రమాదంలో 63 మంది అమాయకులు చనిపోయారు. వందల మంది జీవితాలలో ఆ ప్రమాదం విషాదం నింపింది. ఎందరో ఆప్తులను కోల్పోయి చాలా మంది దుర్బర జీవితాలు గడుపుతున్నారు. గాయాలవారైన వారు చావలేక బతకలేక జీవచ్చవాలుగా బతుకుతున్నారు.
ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ. 2.50 లక్షలు మంజూరు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రమాదం జరిగి నెలరోజులు గడుస్తున్నా ఇంత వరకు పరిహారం మంజూరు కాలేదు. ఇటువంటి విషయాలలో అలర్ట్ గా ఉండాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారించిందని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల కోడ్ వస్తదని తెలిసినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 19 వతేదిన ప్రమాద పరిహారానికి సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్ సచివాలయానికి పంపారు. ఐతే ప్రకృతి విపత్తుల నిర్వహణశాఖ ద్వారా ఆపద్బంధు పథకం కింద కేవలం రూ. 50 వేలు మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది. ఆ ఫైల్ క్లియర్ కావాలంటే సీఎం కేసీఆర్ సంతకం చేయాల్సి ఉంది. కానీ ఆయన సంతకం చేయడానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది.
దీని పై ఓ ఉన్నతాధికారి స్పందిస్తూ ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నాకనే దీని పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అప్పటి వరకు ఏం చేయలేమన్నారు. మరోవైపు గాయపడ్డవారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నప్పటికి ఇతర ఆర్ధిక ఖర్చులు వారిని పట్టిపీడిస్తుండటంతో ఎటు పాలుపోని పరిస్థితిలో వారు బతుకులిడిస్తున్నారు.
బాధితులను పరామర్శించటానికి రాకుండా రాక్షసత్వాన్ని చూపిన కేసీఆర్, పరిహరం విషయంలో కూడా జాప్యం చూపించారని విపక్షాలు విమర్శించాయి. ఎన్నికల కోడ్ వస్తదని తెలిసినా కనీసం ఫైల్ పై సంతకం చేసే సమయం లేదా అని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతి తీసుకోని బాధితులకు వెంటనే సహాయం అందజేయాలని వారు డిమాండ్ చేశారు.