సెకెండ్ వేవ్ ప్రభావం తెలంగాణలో గణనీయంగా తగ్గుతోంది. అయినాగానీ, తెలంగాణ వ్యాప్తంగా అత్యంత పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తామని చెబుతోంది కేసీఆర్ ప్రభుత్వం. లాక్ డౌన్ సడలింపు వేళల్లో జనం గుంపులుగా కనిపిస్తుండడం పట్ల పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మరోపక్క, కరోనా వ్యాక్సినేషన్ పక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్న దరిమిలా, గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. షార్ట్ టెండర్ ద్వారా సుమారు కోటికి పైగా వ్యాక్సిన్లను సమీకరించడం తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యం. నెలకు 1.5 మిలియన్ల డోసులు.. అంటే, 15 లక్షల డోసులు వుండేలా టెండర్లను ఆహ్వానిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలా సమీకరించే వ్యాక్సిన్లతోపాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే వ్యాక్సిన్లను కలిపి వీలైనంత తక్కువ సమయంలో రాష్ట్ర ప్రజలందరికీ టీకాలు అందించాలనే ఆలోచన చేస్తోంది కేసీఆర్ సర్కార్.
అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబల్ టెండర్ల ద్వారా అయినా అవసరమైన మేర వ్యాక్సిన్లను సమకూర్చుకోవడం సాధ్యమేనా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ప్రపంచంలోనే జనాభా పరంగా భారతదేశం రెండో అతి పెద్ద దేశం. భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలున్నారు. అందరికీ టీకాలు అందించడమంటే అంత తేలికైన వ్యవహారం కాదు. గ్లోబల్ టెండర్లను ఆహ్వానించడం కొంతమేర ఊరటనిచ్చే వ్యవహారమే అయినా, స్వదేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడితే, ఆ చర్యలు ఖచ్చితంగా సత్ఫలితాలనిస్తాయి. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లను సమీకరించుకోవడానికి కేంద్రం ఇటీవల అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నిజానికి, గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్ల సమీకరణ కేంద్రమే చేపడితే, ఇంకా మెరుగైన ఫలితాలు వుంటాయేమో.