షాకింగ్! జగన్ సీఎం అవ్వాలని కొడాలి నాని యాగం: పాల్గొన్న టీడీపీ నేత

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగన్ సీఎం అవ్వాలని, గుడివాడ ప్రజలు క్షేమంగా ఉండాలని అమ్మవారి దీవెనలు ఆశిస్తూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని శతచండి యాగం నిర్వహిస్తున్నారు. జగన్ సీఎం పీఠాన్ని అధిష్టాంచాలంటూ నిర్వహిస్తున్న యాగానికి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు హాజరయ్యారు.

ఈ విషయం ఇప్పుడు టీడీపీ, వైసీపీ రాజకీయ వర్గాల్లోను, కృష్ణా జిల్లాలోనూ హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలోకి రావడానికి చేపట్టిన యాగంలో టీడీపీ నేత హాజరు కావడంతో టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. జగన్ సీఎం అవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని జరిపిస్తున్న శతచండి యాగానికి పిన్నమనేని వెళ్లడమేంటి అంటూ కృష్ణా జిల్లా టీడీపీ నేతలు పిన్నమనేనిని నిలదీస్తున్నారు. ఆయనపై సదరునేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆయన టీడీపీ లో ఉంటూ వైసీపీ కి లబ్ది చేకూరే పనులు చేస్తున్నారంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఇలాంటి చర్యలవలన ప్రజల్లో వైసీపీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందని వారు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన పార్టీ మారతారేమో అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాగా పిన్నమనేని మాత్రం అమ్మవారి ఆశీస్సుల కోసం చేస్తున్న యాగాన్ని రాజకీయం చేయవద్దని సూచిస్తున్నారు.

కానీ టీడీపీ నేతలు మాత్రం ఆయన విషయంలో గుర్రుగానే ఉన్నారు. జగన్ హితవు కోసం నిర్వహిస్తున్న యాగంలో పాల్గొని రాజకీయం చేయవద్దనడం హాస్యాస్పదం అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి యాగాల్లో పాల్గొంటూ ఆయన్ని ఓడిస్తామంటే ఎలా నమ్ముతామని నిలదీస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ కొడాలి నాని నిర్వహిస్తున్న యాగానికి వెళ్లడమే కాకుండా ఆయన టీడీపీ సమన్వయ కమిటీకి గైర్హాజరవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆయన పార్టీ మారె ఆలోచనలో ఉన్నారేమో అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి పిన్నమనేని పార్టీ మారతారో లేదో వేచి చూడాలి.