వైసీపీ వెర్సస్ జనసేన: టీడీపీ మౌనం ఎందుకంట.!

సాధారణంగా ప్రతిపక్షం యాక్టివ్ మోడ్‌లో ఉంటుంది. కానీ, ఇక్కడ ప్రతిపక్షానికి సౌండ్ కట్ అయిపోయింది. ఎప్పుడయితే పవన్ కళ్యాణ్ వెర్సస్ జనసేన అన్న చందాన రాజకీయ యుద్ధం మొదలైందో టీడీపీ పూర్తిగా సైడ్ అయిపోయింది. టీడీపీ నేతలు కొందరు ఈ వివాదానికి సంబంధించి పవన్ కళ్యాణ్‌కి మద్దతిస్తున్నా, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పవన్‌ని విమర్శిస్తూ పరోక్షంగా వైసీపీకి మద్దతిస్తున్నారు. వైసీపీ, టీడీపీ కలిసి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నాయి సోషల్ మీడియాలో.

ఇదొక కొత్త ఈక్వేషన్. వైసీపీ నాయకత్వం కానీ, టీడీపీ నాయకత్వం కానీ దీన్ని జీర్ణించుకునే పరిస్థితి ఉండదు. అధికారం అనేది టీడీపీకి అయినా ఉండాలి. లేదంటే వైసీపీకి అయినా ఉండాలి. మూడో పార్టీ రావడానికి ఈ రెండు పార్టీలు ఒప్పుకోవు. ఇది అందరికీ తెలిసిన రాజకీయమే.

కానీ, ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంటోంది. వాస్తవానికి జనసేన అధినేత కూడా ఈ మార్పును ఊహించి ఉండరు. సినిమా వేడుకలో అనుకోకుండా రాజకీయ ప్రస్థావన తెచ్చి ఇంత గలాటాకి పవన్ కళ్యాణ్ కారణమయ్యారు. కానీ, అదే, ఆ ప్రస్థావనే, ఆ వివాదమే జనసేనని తెలుగు రాష్ర్టాల్లో హైలైట్ చేస్తోంది. ఎక్కడ విన్నా ఈ అంశం గురించిన చర్చే జరుగుతోంది.

తెలంగాణలో జనసేనకు సీన్ లేదు. ఏపీలో మాత్రం సీన్ మారింది. మొదటి స్థానంలో వైసీపీ యథాతధంగా కొనసాగుతోంది. జనసేన రెండో స్థానంలోకి వచ్చింది. టీడీపీ అడ్రస్ గల్లంతయ్యింది. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు పవన్ కళ్యాణ్ చదువుతున్నారంటూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌కి మరింత అడ్బాంటేజ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్‌ని ఇగ్నోర్ చేసి ఉంటే, అది వైసీపీకే అడ్వాంటేజ్ అయ్యేది. టీడీపీని పూర్తిగా మాయం చేయాలంటే జనసేనతోనే పంచాయితీ పెట్టుకోవాలని వైసీపీ భావిస్తుండొచ్చు. అదే నిజమైతే, ఇక టీడీపీ ఖేల్ ఖతమైనట్లే.