హాట్ టాపిక్… పిఠాపురంలో చిరంజీవి – వైఎస్ జగన్!

పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ అయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తిచేయడంతో… ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో సుమారు దశాబ్ధ కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి.. అనూహ్యంగా ఏపీలో కూటమి అభ్యర్థులకు తన మద్దతు ప్రకటించారు.

ఇందులో భాగంగా బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబులతో కలిసి వారి విజయానికి ప్రజలు తోడుండాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో భాగంగా… టీడీపీ – బీజేపీ – జనసేన కలిసి కూటమిగా ఏర్పడటం శుభపరిణామమని చెప్పుకొచ్చారు! దీంతో.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయకుండానే.. ఎన్డీయే కూటమి అభ్యర్థులు గెలవాలని కోరుకోవడం ఏమిటంటూ నెటిజన్లు సెటైర్లు పేల్చారు.

ఆ సంగతి అలా ఉంటే… ఎప్పుడైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిరంజీవి ఇలా ఏపీ రాజకీయాలపై ఓపెన్ అయిపోయారో.. సరికొత్త ఊహాగాణాలు తెరపైకి రావడం మొదలయ్యాయి. ఇందులో భాగంగా… మే నెల మొదటివారంలో.. మరికొన్ని రోజుల్లో ప్రచార పర్వాలకు శుభం కార్డు పడనుందనగా చిరంజీవి ఎంట్రీ ఉంటుందని, ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గంలో తమ్ముడు పవన్ తరుపున ఆయన బహిరంగ సభ కానీ.. రోడ్ షో లో కానీ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.

ఇదే సమయంలో… అనాకపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్.. జనసేన పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు తరుపున కూడా ఆయన ప్రచారం చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు. దీంతో… పిఠాపురంలో చిరంజీవి ప్రచారం అనే ప్రచారం వైరల్ గా మారుతోంది!

ఆ సంగతి అలా ఉంటే… ఈ ఎన్నికల్లో ఏపీలోని హాట్ హాట్ నియోజకవర్గాలో పిఠాపురం ఫస్ట్ వరుసలో ఉంటుందనేది తెలిసిన విషయమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఇంట్రస్ట్ నెలకొంది. ఇదే సమయంలో… పిఠాపురంలో కూడా పవన్ ని ఓడించాలని వైసీపీ బలంగా ఫిక్సయినట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే వంగ గీత ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించేస్తుండగా.. మిథున్ రెడ్డి తెరవెనుక వ్యూహాలతో పావులు కదుపుతున్నారని అంటున్నారు. మరోపక్క కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తనకున్న అనుభవంతో పిఠాపురంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు కదులుతూ.. పవన్ కు ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారని చెబుతున్నారు.

ఇదంతా ఒకెత్తు అయితే… మే నెల మొదటివారంలోనే పిఠాపురంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారం కూడా ఉండొచ్చని అంటున్నారు. ఎన్నికల ప్రచార పర్వం ముగిసే లోపు కచ్చితంగా ఒక పూర్తి రోజు ఆయన పిఠాపురంపై ప్రత్యేక శ్రద్ధపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. సిద్ధం సభల రేంజ్ లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. పవన్ కు చెక్ పెట్టాలని భావిస్తున్నారని అంటున్నారు.

దీంతో… ఒకటి రెండు రోజుల వ్యవధిలో పిఠాపురం నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ల ప్రచారం ఉందనే వార్త ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.