చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ షర్మిల

ఏపీ సీఎం చంద్రబాబు కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో భూతద్దం పెట్టి వెతికినా ఎలాంటి  అభివృద్ధి కనిపించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలకు ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు. ఇప్పుడు తప్పు చేస్తే మరో ఐదేళ్లు బాధపడతామని హెచ్చరించారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదనీ, అందరికి భరోసా ఉండేదని షర్మిల తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మొదటిదాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. ఏపీలో రూ.84,000 కోట్లుగా ఉన్న రైతుల రుణాలను రూ.24,000 కోట్లకు కుదించారని వ్యాఖ్యానించారు. 

Related image

పేదలు ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలని చంద్రబాబు శాసించారని షర్మిల చెప్పారు. మరి, అనారోగ్యం వస్తే చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికే వెళతారా? అని ప్రశ్నించారు. డ్వాక్రా రుణాలు అన్నింటిని మాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు.

బాబు వస్తేనే జాబు వస్తుందని ఊదరగొట్టిన చంద్రబాబు కుమారుడు లోకేశ్ కు మూడు పదవులు కట్టబెట్టారని షర్మిల దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలంగాణలో ఐటీ మంత్రిగా ఉన్నారని లోకేశ్ కు ఏపీలో ఐటీ శాఖ అప్పగించారని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదాను నీరుగార్చిన చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని షర్మిల విమర్శించారు. చంద్రబాబు ప్రతీఇంటికి రూ.1.25 లక్షలు బాకీ పడ్డారన్నారు. 

వైసీపీ అధినేత జగన్ గత 9 సంవత్సరాలుగా విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని షర్మిల తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇప్పుడు కొత్త అబద్ధాలు, దొంగ హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారని ఆరోపించారు. 

 సీఎం చంద్రబాబు పాలనలో సామాన్యుడు సంతోషంగా లేడని వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలిపారు. ‘చందమామను తెచ్చిస్తా’ అని చంద్రబాబు చెప్పే అబద్ధాలను ఏపీ ప్రజలు మళ్లీ నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. చంద్రబాబు పదవి కోసమే పథకాలు ప్రకటిస్తారనీ, ప్రజలను పట్టించుకోరని దుయ్యబట్టారు. కాంట్రాక్టుల కోసమే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి లాగేసుకున్నారని వ్యాఖ్యానించారు.

రాజధాని ప్రాంతంలో ఎకరం రూ.3 కోట్లు పలుకుతున్న భూములను రూ.50 లక్షలకే తన బినామీలకు సీఎం కట్టబెట్టారని విమర్శించారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడారు.

నిప్పునిప్పు అని చెప్పుకున్నంత మాత్రాన తుప్పు నిప్పు అయిపోతుందా? అని షర్మిల ప్రశ్నించారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నంత మాత్రన అబద్దాలు నిజాలు అయిపోవని స్పష్టం చేశారు. చంద్రబాబును చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుందని దుయ్యబట్టారు. కేటీఆర్ కు పోటీగానే ఏపీ ఐటీ శాఖను నారా లోకేశ్ కు చంద్రబాబుకు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు.

అసలు జయంతికి, వర్థంతికి తేడా తెలియని లోకేశ్ కు చంద్రబాబు మూడు మంత్రి పదవులు అప్పగించారని షర్మిల ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రశ్నించరన్న నమ్మకంతోనే బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని షర్మిల ఆరోపించారు. బాబు-మోదీ జోడీ వల్లే ఏపీకి ప్రత్యేకహోదా రాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.