కెసియార్ కు చంద్రబాబుకు తేడా అదే…

(మల్యాల పళ్లంరాజు)

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప మతలబు తోనే  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. రాజకీయాలలో చిరకాల శతృవులు, మిత్రులు అంటూ ఉండరు. ఒకప్పుడు బద్ధ శతృవులుగా ఉన్న పార్టీలు తిరిగి ఆలింగనం చేసుకోవచ్చు. మిత్రులే కత్తులు దూసుకోవచ్చు. ఇందుకు ఆయా సమయాల్లో రాజకీయ పరిస్థితులు, రాజకీయ మనుగడ, పార్టీ భవిష్యత్, తక్షణ అవసరాలు  దోహద పడతాయి. అపర రాజకీయ చాణక్యుడుగా పేరొందిన నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అలాంటి ఏవో కారణాల వల్లే… తెలుగుదేశం పార్టీకి చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో జాతీయ స్థాయిలో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు.

 

కేంద్రం లోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని  భారతీయజనతా పార్టీకి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా గట్టి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలంటే  ప్రాంతీయ పార్టీలను ఏకం చేసినంత మాత్రాన సరిపోదు.. ఆ వాస్తవాన్ని గుర్తించిన నారా వారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కెసిఆర్ కు చంద్రబాబుకు తేడా అక్కడే ఉంది. కేసియార్ జాతీయ పార్టీని విస్మరించి తెలంగాణ ఉద్య మం లాగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ తనచుట్టూ తిప్పుకోబోయే ప్రయత్నం చేశారు. అప్పటికీ మాయావతి కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ అవసరం ఉందని చెబుతున్నారు. చివరకేమయింది. ఆయన అలసిపోయి విరామం ప్రకటించాల్సి వచ్చింది. దానికితోడు కెసియార్ ప్రయత్నం మొదలుపెట్టగానే అది బిజెపికి సాయం చేసేందుకు చేస్తున్న ప్రయత్నం అని టాక్ వచ్చింది.  చంద్రబాబు బిజెపి వ్యతిరేకత విషయంలో చాలా క్లారిటీ తో ముందుకు నడిచారు. తెలివిగా  తన ప్రయత్నాల్లోకి రాహుల్ ని కూడా లాగారు.దీనివల్ల టిడిపికి  ప్రయోజనమే కాని, నష్టమేముంది.అదే చాణక్యం అంటే.

కాంగ్రెస్ తో కొన్ని పొరపొచ్చాలు ఉన్న బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని, మహారాష్ట్రలో కాంగ్రెస్ కు దూరమవుతున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ అధ్యక్షుడు శరద్ పవార్ ను,  సమాజ్ వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్, అఖిలేశ్ యాదవ్ తోపాటు, ఒడిషా ముఖ్యమంత్రి బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ తో పాటు అటు వామపక్షాలను ఒక తాటిపై చేసేందుకు ఢిల్లీ వేదికగా టిడిపి అధినేత మంత్రాంగం నడిపారు.

 

2019 ఎన్నికలలో ఎన్డీయేను జాతీయ స్థాయిలో చావు దెబ్బ తీయడమే లక్ష్యంగా  కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు అన్నింటినీ ఏకం చేసేందుకు కాశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లాతో పాటు అందరినీ కలిసేందుకు ఆసక్తి చూపడం, జరిగిన చర్చలను జాతీయ మీడియాతో సహా అన్ని రాష్ట్రాల మీడియాను ఆకర్షించింది.   నరేంద్ర మోడీ సర్కార్ కు 2019లో మంగళం పాడడమే ఈ ప్రతిపక్షాల ఐక్యత ఏకైక లక్ష్యం.కాగా దేశాన్ని రక్షించడం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిరక్షణ, నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా తాము సమైక్య పోరాటం సాగించనున్నట్లు చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ  జాతీయ మీడియాకు వివరించడం విశేషం.

ప్రజాస్వామ్యంలో రాజకీయపార్టీల మనుగడకు అధికారమే కీలకం. అధికారంలో కొనసాగినన్నాళ్లూ ఆయా పార్టీలకు మంచి రోజులే. అధికారం కోల్పోయిన తరువాత పార్టీని నిలుపుకోవడం, కాపాడుకోవడం, మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ కార్యకర్తలు, నాయకులు చెక్కుచెదరకుండా చూసుకోవడం ఎంతో కష్టం. వైఎస్ రాజశేఖర రెడ్డి  హయాంలో 2004 నుంచి అధికారానికి దూరమైనా తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబునాయుడు అత్యంత సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు. ఎప్పటి కప్పుడు రాజకీయ అస్థిత్వాన్ని నిలుపుకునే విధంగా వివిధ కార్యక్రమాలు, ఆందోళనలు, చేపడుతూ, పార్టీకి ఊపిరి పోశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పై ప్రజలకు గల ఆగ్రహాన్ని తనకు అనుగుణంగా మరల్చు కోవడంలోనూ సమర్థంగా వ్యవహరించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేంద్రంలో అధికారంకోసం దూసుకువస్తున్న బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభంజనాన్ని గుర్తించి ఆ పార్టీతో జత కట్టారు. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన సినీ నటుడు పవన్ కల్యాణ్ ను కూడా ఆకట్టుకుని కొత్త రాష్ట్రంలో అధికారం దక్కించుకున్నారు. రాజధాని కానీ, కనీస సౌకర్యాలు కానీ లేని రాష్ట్రానికి ఒక దశ ,దిశ నిర్దేశించేందుకు  సమర్థుడైన నాయకుడి అవసరాన్ని గుర్తించిన ప్రజలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత జగన్ ను కాదని, నారా చంద్రబాబు నాయుడికి అధికారం కట్ట పెట్టారు.

  అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు  కొత్త రాజధాని నిర్మాణం, కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను తామే చేపట్టినా, రాజధాని భూముల వ్యవహారం, కుల రాజకీయాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి విభజన హామీలు రాబట్టడంలో విఫలమయ్యారు. మొదట ప్రత్యేక హోదా కోసం కృషి చేసి, హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు దిగజారిన తర్వాత తిరిగి ప్రత్యేక హోదా కోసం యూటర్న్ తీసుకోవడం వంటి నిర్ణయాలవల్ల, రాష్ట్రంలో పెచ్చుపెరిగిన అవినీతి వల్ల  రాష్ట్ర ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, ప్రతిపక్షాలకే విజయావకాశాలు అన్న పలు సర్వేల నివేదికలతో దిక్కుతోచని పరిస్థితుల్లో పార్టీ మనుగడ, తిరిగి ఆంధ్రప్రదేశ్ లో అధికారం నిలుపు కోవడం కోసం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అంటూ ఢిల్లీ బాట పట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారం కోల్పోతే, తిరిగి పార్టీని పరిపక్షించుకోవడం ఎంత కష్టమో తెలిసినా, కాంగ్రెస్ తో దోస్తీకి సిద్ధమయ్యారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడమే రాజకీయమంటారు. ఇపుడు చంద్రబాబు చేస్తున్నదదే.

అధికారం కోసం ఇతర పార్టీలతో  పొత్తులు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు కొత్త కాదు. గతంలో  తమతో సిద్ధాంత పరమైన విబేధాలు ఉన్న వామపక్షాలతో పాటు, ఒక దశలో తాను నమ్మిన సమైక్య రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి తో కూడా పొత్తు పెట్టుకున్న చరిత్ర ఉంది. అసలు టిఆర్ ఎస్ పుట్టింది మొదట చంద్రబాబుకు వ్యతిరేకంగానే, ఆ తర్వాతే తెలంగాణ కోసం.

తెలంగాణలో కే. చంద్రశేఖరరావు పాలనలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు దాదాపు బోర్డు తిప్పేసే పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో  కేసీఆర్ ప్రతిపక్షపార్టీల నాయకులందరినీ తమ పార్టీలో చేర్చుకుని, మంత్రి పదవులు ఇచ్చి ఆ పార్టీల మనుగడకే గండి కొట్టారు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు, తెలంగాణ లోనూ తెలుగుదేశం పార్టీని, కేడర్ ను పరిరక్షించు కోవల్సిన ఆవశ్యకత గుర్తించిన చంద్రబాబు  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు, ఎన్నికల సర్దుబాటు కోసం ముందుకు వచ్చారు. టీఆర్ ఎస్ తిరిగి అధికారంలోకి రాకుండా అడ్డుకుని కాంగ్రెస్ ను అధికారంలో నిలపడం ద్వారా తమ పార్టీ పరిరక్షణే లక్ష్యంగా మంత్రాంగం నడిపారు.

1982లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా  తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన స్వర్గీయ ఎన్టీ రామారావు, తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో 1983లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరిన నారా చంద్రబాబు నాయుడు క్రమంగా ఇంతింతై.. అన్నట్లు ఎదిగి, 1996 ప్రాంతంలో ఎన్టీ ఆర్ ను తప్పించి, తానే ముఖ్యమంత్రి పదవి, పార్టీ పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి పార్టీని సమర్థంగా నడుపుతూ వస్తున్నారు. ఇందుకోసం గతంలో పలు సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, దూరం చేసుకోవడం, తిరిగి జత కట్టడం టిడీపీ చరిత్రలో భాగమే.  కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీ కాంగ్రెస్ తో నే జతకడితే, ఎదురయ్యే వ్యతిరేకత, విమర్శలు, వ్యాఖ్యలు రాజనీతిజ్ఞుడైన చంద్రబాబుకు తెలియనిది కాదు. కానీ, పార్టీ, సర్కార్ మనుగడ, భవిష్యత్ పరిణామాలను ముందుగా అంచనా వేసిన చంద్రబాబు తాను అనుకున్నది సాధించారు.

 

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని వ్యతిరేకించిన వారిలో డిప్యూటీ ముఖ్యమంత్రి కె.ఈ కృష్ణమూర్తి, సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యులు.  సీనియర్ ఎంపీ దివాకర్ రెడ్డి కూడా వ్యతిరేకించిన వారిలో ఉన్నారు. ఇయితే కెయి. కృష్ణమూర్తి అలాంటి పొత్తు కుదిరితే తలతెంచుకుంటామని చెప్పడం తీవ్రమైన విషయం. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులుగా భావించే అచ్చెన్నాయుడు, కృష్ణ మూర్తి ముఖ్యమంత్రి మనస్సులో ఆలోచనను ఎందుకు గ్రహించలేకపోయారన్నది ప్రశ్న. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ  కాంగ్రెస్ తో టీడీపీ జత కట్టింది. తెలంగాణ లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీరాలు పలికిన అచ్చెన్నాయుడు, కృష్ణమూర్తి ఏం చేస్తారో చూడాలి. వీరితో పాటు మరికొందరు నాయకుల విమర్శలు, వ్యాఖ్యల పట్ల ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఏ చర్య తీసుకుంటారో చూడాలి.

 

 మీడియా మేనేజిమెంట్ లో చంద్రబాబును మించినవారు లేరు. ఎన్టీఆర్ నుంచి పగ్గాలు చేపట్టిన సమయంలో అప్పటి వార్తా పత్రికలు, అప్పుడే విస్తరిస్తున్న ఎలక్ట్రానికి మీడియాను గొప్పగా మేనేజ్ చేసి తనకు వ్యతిరేకత రాకుండా చూసుకోగలిగారు. తర్వాత తమకు అనుకూలురైన పారిశ్రామిక వేత్తలతో వివిధ చానళ్లు పెట్టించి,ఉభయ తెలుగురాష్ట్రాలలో టీడీపీ అనుకూల ప్రచారం జరిగేటట్లు చేయడంతో కృతకృత్యులయ్యారు.  కాంగ్రెస్ తో జతకట్టి, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు చేస్తున్న కృషి కారణంగా జాతీయ మీడియా కూడా చంద్రబాబు కార్యకలాపాలను, రాజకీయ సమావేశాలను, మీడియా సమావేశాలను ప్రసారం చేయక తప్పని పరిస్థితి తీసుకువచ్చారు. ఏమైనా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పడంతో జాతీయ స్థాయిలో రూపు దిద్దుకుంటున్న ప్రతిపక్షాల కూటమి 2019తో మోడీని చిత్తు చేస్తే..భవిష్యత్ లో నారా వారికి తిరుగే ఉండదు.  

 

(మల్యాల పళ్లంరాజు, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్. వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)