సీమ మనుగడ కోసం మైసూరా సమరశంఖం!

(యనమల నాగిరెడ్డి)

నిరంతరం కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ ఆవేదన తీర్చడానికి 1984లో శివరామకృష్ణారావు లాంటి కొందరు పెద్దలు నాటిన మైసూరా రెడ్డి అనే చిన్న మొక్క 1989 నాటికి వృక్షమైంది. ఎం.వి.ఆర్ , వైస్సార్ లాంటి ఘనాపాఠీలను, సి.హెచ్. చంద్రశేఖర్ రెడ్డి లాంటి కార్మిక నాయకులను సమన్వయ పరచి, సీమ ఉద్యమాన్ని నడిపి, టీడీపీ ప్రభుత్వానికి చెమటలు పట్టించిన ఘనుడు మైసూరా.!
రాష్ట్ర విభజన తర్వాత కూడా అనేక మౌలిక సమస్యలు అలాగే ఉన్న నేపధ్యంలో సీమ “అస్తిత్వం” (పేరుతో) కోసం పోరాడాలన్న తపనతో మైసూరా సమరశంఖం పూరించారు. తాను రాసిన అస్థిత్వం పుస్తకావిష్కరణ సభలు వేదికగా మైసూరా రెడ్డి తన మనోభావాలను వెల్లడించారు.

రాయలసీమ ఆస్తిత్వానికే సమస్య?

సమైక్య రాష్ట్రంలో తెలంగాణా, ఆంధ్ర, రాయలసీమ అన్న మూడు ప్రాంతాలు ఉండేవి.
రాష్ట్ర విభజన సమయంలో పత్రికలు తమ సౌలభ్యం కోసం “రాయల” అన్న మూడు అక్షరాలు తగ్గించి “సీమాంధ్ర”అని నామకరణం చేసి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందించి రాయలసీమ పేరు కనిపించకుండా చేశారు. ఇక మరి కొంత కాలం జరిగితే, రాజకీయ పార్టీలు, పత్రికలు “రాయలసీమ” పేరు కూడా వినిపించకుండా చేస్తాయని, ఈ ప్రాంత అస్తిత్వాన్ని ప్రస్నార్థకం చేశారని మైసూరా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నేటికి తీరని సీమ సమస్యలు

1953 నుండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలలో అనేకం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. 2014 నాటి రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ సమస్యలు పరిష్కారం కాగలవన్న ప్రజల ఆశలు ఆడియాసలుగా మిగిలాయి.
మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు చేసుకున్న “శ్రీభాగ్” ఒప్పందానికి గతంలో పాలకులు పాతర వేశారు.ప్రస్తుత రాష్ట్ర విభజన తర్వాత 1953 నాటి రాష్ట్రం ఏర్పడిందని, తమ కోరిక మేరకు రాయలసీమకు రాజధానికానీ/ హైకోర్టు కానీ వస్తాయని, అలాగే నీటి కష్టాలు తీరగలవని ఆశించిన ఈ ప్రాంతవాసుల ఆశలకు పాలక, ప్రతిపక్షాలు సంయుక్తంగా పాతరవేశారు. ప్రకటనలతో సీమవాసులను ఊరిస్తున్న ప్రభుత్వం ఆచరణలో ఆ ఊసే ఎత్తడంలేదు. అలాగే ఈ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను, సాగునీటి ప్రాజెక్టులకు నిదుల కేటాయింపులు, నీళ్ల కేటాయింపులపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతుండగా, విపక్షం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది.
కోస్తా ప్రాంతంలో చేపట్టిన పట్టిసీమ, పోలవరం, పురుషోత్తంపట్నం,చింతలపూడి,వైకుంటపురం ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన చేస్తున్న టీడీపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు అరకొర నిధులు విదిలిస్తూ నత్తనడకన సాగదీస్తున్నది. ఈ నేపథ్యంలో సీమ పాతకాపు మైసూరా రెడ్డి సీమ అస్థిత్వం కోసం పోరాడాలని భావిస్తున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో పత్రికలు తమ సౌలభ్యం కోసం “రాయల” అన్న మూడు అక్షరాలు తగ్గించి “సీమాంధ్ర”అని నామకరణం చేసి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందించి రాయలసీమ పేరు కనిపించకుండా చేశారు.

అయితే రాయలసీమను అంటరాని ప్రాంతంగా చూస్తున్న రాజకీయ పార్టీలతోఅంటకాగుతున్న నాయకులు, వారి తోకలుగానే ఉంటున్న జనం ఏమాత్రం స్పందిస్తారో అంచనా వేయడానికి ఈ సభలను ఆయన వేదికగా చేసుకున్నారని చెప్పవచ్చు.

కేంద్రీకృత అభివృద్ధి

సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకవాదానికి దారితీసిన అంశాలలో ప్రధానమైనవి అభివృద్ధి కేంద్రీకరణ, నీటి కేటాయింపులలో అన్యాయాలు, రాష్ట్రపతి ఉత్తరువులమేరకు ఏర్పడిన జోనల్ వ్యవస్థ అమలులో వైఫల్యం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన “ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను’ నిర్వీర్యం చేయడం లాంటి అంశాలు సుధీర్ఘంగా సాగిన ప్రత్యేక తెలంగాణా ఆందోళనలకు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు.
రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో పాలకులు, ఇతర రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని కోస్తాలో కేంద్రీకరిస్తూ, రాయలసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల అతి తక్కువ కాలంలోనే మరో ప్రత్యేక రాష్ట్ర వాదానికి “ప్రాణం పోశారు”.
శ్రీభాగ్ ఒప్పంద స్పూర్తికి విరుద్ధంగా రాజధానిని కోస్తాంధ్ర లో ఏర్పాటు చేయడం, హైకోర్టును కూడా సీమకు కేటాయించక పోవడం, నీటి కేటాయింపుల్లో వివక్ష, సీమ నీటి ప్రాజెక్ట్ ల నిర్మాణంలో ప్రభుత్వ వైఖరి, ఉద్యోగాల విషయంలో వివక్ష, వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ సాధనలో వైఫల్యం లాంటి అనేక అంశాలు రాయలసీమ ప్రత్యేక వాదానికి ఊపిరి పోస్తున్నాయి.

రాజకీయ పార్టీల నిర్లజ్జాపూరిత వైఖరి

రాయలసీమ నాయకుల పదవీ లాలస మరోసారి బయట పడింది. అందుకోసం గతంలో నాయకులు అనుసరించిన “పదవీ బానిస సిద్ధాంతాన్ని” ప్రస్తుత నాయకులు మరింత నిర్లజ్జగా ఆచరిస్తున్నారు.రాయలసీమలో 52, కోస్తాలో 123 ఎం.ఎల్.ఏ సీట్లు ఉండటం, వారి దయ లేకపోతే పదవి దక్కదన్న ఆలోచన ఇందుకు ప్రదాన కారణంగా చెప్పవచ్చు. “ఉన్న పదవిని పదిలం చేసుకోవాలని” టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేయడంలో భాగంగా “అన్ని పనులు” అక్కడికే పరిమితం చేస్తున్నారు.

ఇకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన వైస్సార్ పార్టీ అధినేత జగన్ అందులో పూర్తిగా విఫలమయ్యారు.
‘తన అనుభవ రాహిత్యం, రాజకీయ ఎత్తుగడలపై అవగాహన లేని సలహాదారులు’ తోడుగా “మన ప్రభుత్వం వచ్చిన ….తర్వాత మీకంతా స్వర్గమే ఉంటుందంటూ” జనానికి అరచేతిలో వైకుంఠం చూపుతూ, ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ రెడ్డి సుదీర్ఘ యాత్రలు సాగిస్తున్నారు.
రాష్ట్ర విభజన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కలికానికి కూడా కనిపించని కాంగ్రెస్, టీడీపీతో జతకట్టి అడ్రసు గల్లంతు చేసుకున్న బీజేపీ, ఉన్నంతలో ఉనికి చాటుకోడానికి ఆపసోపాలు పడుతున్న కమ్యూనిస్టులు, కొత్తగా పుట్టి రోజుకో రాగం తీస్తున్న జనసేన పార్టీలు రాయలసీమ అవసరాలపై మొసలి కన్నీరు కారుస్తూ కోస్తా ముందు మొకరిల్లుతున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో, ఆ తర్వాత ఏ.పిలో పాలక పక్షమైన టీడీపీ, ప్రతిపక్షమైన వైస్సార్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాన్ని చీల్చి చెండాడిన కాంగ్రెస్ పార్టీలు సీమ సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ సమస్యలపై స్పందిస్తే కోస్తా నాయకుల ఆగ్రహానికి గురికాక తప్పదని, అలా జరిగితే తమ అధికార పీఠం జారిపోతుందన్నభయంతో వీరు నోరు తెరవడం లేదు. ఆయా పార్టీల రెండవ శ్రేణి నాయకులు తమ పెద్దల వైఖరికి భిన్నంగా నోరు విప్పలేకున్నారు. సీమ ప్రజలు ఏమాత్రం మారకుండా తమదైన శైలిలో నాయకుల వెంట నడుస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం సీమ ఉద్యమం

రాష్ట్ర విభజన తర్వాత పాలక, ప్రతిపక్ష పార్టీల వైఖరిని నిరసిస్తూ ప్రజాసంఘాలు యధాశక్తి గళం విప్పుతున్నా అది చెవిటిముందు శంఖం ఊదినట్లుంది తప్ప ఫలితం లేదు.రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు, ప్రజాసంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా రాయలసీమ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు.
ఇటీవల తమగొంతు మరింత పెంచి రాజకీయ నాయకులలో కొంత చలనం తేగలిగారు.

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రాష్ట్రమే శరణ్యం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే రాయలసీమ సమస్యలకు పరిష్కారం సాధ్యమని ఉద్యమ నాయకులతో పాటు మైసూరా రెడ్డి కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాంతానికి న్యాయంగా రావలసిన నీరు, నిధులు, కేంద్ర సాయం సాధించ కుండా ప్రత్యేక రాష్ట్రమంటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని సి.హెచ్ చంద్రశేఖరరెడ్డి లాంటి నాయకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక రాష్ట్రం పేరుతో పోరాటమే సమస్యల పరిష్కారానికి శరణ్యమని మైసూరారెడ్డి ఆలోచన. ఇందుకోసం ప్రజలు ముందుకు వస్తే సహకరించడానికి తాను సిద్ధమని ఆయన ఈ సభలలో ప్రకటించారు. టి.ఆర్.ఎస్. లాగా రాయలసీమ కోసం ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయాల్సి ఉందని, పోరాడితేనే ఫలితం దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.

1984 నుండి 1989 వరకు ఉద్యమ తీరుతెన్నులు వేరుకాగా ఇపుడున్న పరిస్థితి వేరని ఉద్యమకారులు అంటున్నారు.
టీఆరెస్ పార్టీకి ఉన్న స్థానబలం, విద్యార్థుల సహకారం, రాజకీయ ఏకాభిప్రాయం, ఆర్థిక బలం, లాబీ చేయగల సామర్థ్యం, మీడియా అండదండలు పుష్కలంగా ఉండటం లాంటి అంశాలు తెలంగాణ ఏర్పడటానికి కారణం ఆయ్యాయని, రాయలసీమ లో ఇందుకు పూర్తి వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయని ప్రస్తుత ఉద్యమనాయకులు అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితులలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమించడం, ప్రత్యేక పార్టీ పెట్టి ప్రజలను వెంటనే కదిలించడం కత్తిమీద సామేనని పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్ టీడీపి పొత్తు గిట్టక ఆయా పార్టీలను వదులుతున్న నాయకులను ఏకం చేయగలిగితే కొంతమేర ఫలితం ఉంటుందని కూడా వారంటున్నారు.

అయితే “కరుడుకట్టిన కోస్తా వాసులుగా ఉన్న రాయలసీమ నాయకుల చేత సమైక్యంగా ‘సీమరాగం’ ఆలపింప చేయగల శక్తి” మైసూరా రెడ్డికి ఉందా? అన్నది ప్రస్తుతం జనాన్ని వేధిస్తున్న ప్రశ్న.

కార్యదీక్షాపరుడైన మైసూరా పూరిస్తున్న ఈ సమర శంఖం ఎంత వరకు పనిచేస్తుందో వేచి చూడాల్సిందే!