గన్‌మెన్‌తో గొడుగు పట్టించుకున్న తెలంగాణ మహిళా ఎమ్మెల్యే

ఈ మధ్య ఎంపీ, ఎమ్మెల్యేలకు వెనుక ఉండే గన్ మెన్లు అంటే వారికి జీతగాళ్ల లెక్క అయిపోయింది. ఎందుకంటే వారి డ్యూటి వారు చేయడమే కాకుండా వాళ్ల ఫోన్లు మోయాలే, ఫైల్లు మోయాలే అవే కాకుండా వాళ్లకు ఎండకొట్టకుండా, వానకు తడువకుంట గొడుగులు కూడా పట్టాలే. ఇది వాళ్ల పనై పోయింది. లేకుంటే మేడానికో, సారుకో కోపమొస్తే కొలువు ఉంటదో ఊడుతదో అని రందీ మరీ. అయితే ఈ మధ్య కుమ్రం భీం అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ కూడా గన్ మెన్ తో గొడుగు పట్టించిందట. ఇంతకీ ఎమ్మెల్యే లక్ష్మీ కథేంటో మీరూ చదవండి.

ఎమ్మెల్యే కోవా లక్ష్మీ

కోవాలక్ష్మీ అధికార టిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే. అసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. జూలై 23న జైనూరు మండలం మార్లవాయి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఆ సమయంలో ముసురుగా వర్షం కురుస్తుండటంతో ఎమ్మెల్యేకి గన్ మెన్ గొడుగు పట్టుకుని నిలుచున్నాడు.  గన్ పట్టుకొని నిలబడాల్సిన ఆయన గొడుగు పట్టుకొని నిలుచున్నాడు. ఇదే సమయంలో జరగకూడనిది జరగితే గన్ మెన్ అలర్ట్ అయ్యే లోపు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. 1999లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తం ఇటువంటి ప్రమాదంతోనే మరణించారు.

ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాల్పిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ వారి విధులను ఆటంకపరిచి ప్రజాప్రతినిదులు ఈ విధంగా వ్యవహరిస్తే చాలా ప్రమాదమేనని పలువురు అంటన్నారు.అయినా ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహారించటంపై విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించటం దారుణమని, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధుల పనిమనుషులు కాదని వారు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేకి గన్ మెన్ గొడుగు పట్టిన వ్యవహారం ఇప్పుడు అంతా హాట్ టాపిక్ గా మారింది.