ఎన్టీఆర్ పార్టీ పేరు ప్రకటించినప్పటి నుంచి… ఆయన మృతి అనంతరం చితాభస్మాన్ని పవిత్ర నదుల్లో నిమజ్జనం చేసిన ఘటనల వరకు నేనో ప్రత్యక్ష సాక్షిని. దాదాపు ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి మేమెంతోమంది ఆనాటి జర్నలిస్టులం ప్రత్యక్ష సాక్షులం.
తెలుగుదేశం పార్టీ పేరును ఎన్టీఆర్ ప్రకటించిన నాడు (మార్చి 29, 1982) నేను ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో క్రైం రిపోర్టరు గా పనిచేస్తున్నాను. ఓల్డ్ ఎంఎల్ఏ క్వార్టర్స్ లో ఎన్టీఆర్ పార్టీ పేరు ప్రకటించిన రోజునే అసెంబ్లీ నుంచి రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు, అధికార కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి ఎం.ఎం.హాషిం పరాజయం, జనత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.బాబుల్ రెడ్డికి పార్టీని ధిక్కరించి 17 మంది కాంగ్రెస్ ఎంఎల్ ఏల మద్దతు, వీరిలో ఎన్టీఆర్ వెంట నడిచేందుకు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన నాదెండ్ల భాస్కరరావుతో సహా నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులూ ఉన్నారు. పేరు కూడా పెట్టని ఎన్టీఆర్ పార్టీకి ఇది తొలి విజయమని సంబరపడుతూ నాదెండ్ల వంటి వారు ఓల్డ్ ఎంఎల్ ఏ క్వార్టర్స్ లో ఎన్టీఆర్ కోసం ఎదరుచూస్తుండగా, నాలుగున్నర దశాబ్దాలుగా వెండితెర వేలుపుగా వెలుగొందిన ఎన్టీఆర్ నేరుగా ఓల్డ్ ఎంఎల్ ఏ క్వార్టర్స్ ఆవరణలో వందలాది మంది అభిమానుల కేరింతల మధ్య తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించారు. మన పార్టీ పేరు.. అంటూ ఓ క్షణం తనదైన శైలిలో ఆగి.. అందరి వంకా ఓ క్షణం పాటు పరికించి చూసి.. కుడి చేయి గాలిలోకి లేపి.. తెలుగు దేశం పార్టీ… అంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించిన ఎన్టీఆర్ కొద్ది క్షణాల పాటు అలాగే స్టిల్ లాగా నిలిచుని ఉండిపోయారు.
ఈలలు, కేరింతలు, చప్పట్ల మధ్య పార్టీ పేరు అప్పుడే తెలుసుకున్న నాదెండ్ల బృందం అందరితో పాటు హర్షధ్వానాలు చేసేరు. జనం పోగయ్యే చోట క్రైం రిపోర్టుకు బీట్ ఉంటుంది. అలా ఆ చారిత్రాత్మక ఘటనకు నేను ప్రత్యక్ష సాక్షిని అయ్యాను. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో మా సీనియర్ నీలంరాజు మురళీధర్ (NM) ఈ ఈవెంట్ రిపోర్టు చేసేరు. నేను రిపోర్టు రాయకపోయినా ఉదయం నుంచి ఓల్డ్ ఎంఎల్ ఏ క్వార్టర్స్ ఆవరణలో రిపోర్టింగ్ బీట్ లో ఉండటం వల్ల మా NMగారికి అక్కడి విశేషాలు చెబితే ఆయన వాటన్నిటిని చక్కగా తన రిపోర్టు వివరణాత్మకంగా రాసేరు. అలా నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ప్రత్యక్ష సాక్షిని.
ఆ తరువాత ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ వ్యవహారాల రిపోర్టింగ్ వల్లనే నేను పొలిటికల్ వార్తా సేకరణలో కాస్తో కూస్తో అనుభవం గడించాను అని చెప్పాలి. దాదాపు అన్ని మహానాడు సమావేశాలను రిపోర్టు చేసేను. ఎన్టీఆర్ ను నాదెండ్ల బృందం అధికారం నుంచి తోసివేయడంతో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం కవరేజ్ నేను వరంగల్ నుంచి చేసేను. అప్పట్లో నేను వరంగల్ లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టుగా ఉన్నాను. వరంగల్ ఎడిషన్ కి ఉద్యమ వార్తా విశేషాలు ఫొటోలతో సహా ఇచ్చేందుకు పరుగులు పెట్టవలసి వచ్చేది. సాయంత్రం 5 గంటల కల్లా హైదరాబాద్ ఎడిషన్ సెంటర్ కి ఫొటోలు అందితేనే మర్నాడు ఎడిషన్ లో కవర్ కావడానికి వీలుండేది.
కనీసం ఉదయం 11 గంటల ఆర్టీసి బస్సుకు ఫొటోల కవర్ పంపితే మాత్రమే మర్నాడు ఫొటో కవరేజ్ కి అవకాశం. వృత్తిపరంగా చాలా ముఖ్యమైన ఈవెంట్.. సరిగా కవర్ చేయకపోతే వెనకపడిపోతాం.. వరంగల్ లో తెలుగుదేశం పార్టీ అన్నా, ఎన్టీఆర్ అన్నా వీరాభిమానం చూపించే కొందరు యువ నేతలను సెంటర్ లో ఉదయం 9 గంటలకే ఆందోళనా కార్యక్రమాలు చేపడితే తప్ప మర్నాడు కవరేజ్ కష్టమని చెప్పడంతో ఇండియన్ ఎక్స్ ప్రెస్ మీద (అఫ్ కోర్స్ నా మీద కూడా) అభిమానంతో టిడిపి యూత్ ధర్నాలు, నాదెండ్ల దిష్టి బొమ్మలు తగులబెట్టి నేను వార్త రాయడానికి సాయం చేశారు. అలా ముందున్న యువనేతల్లో దోనేపూడి రమేష్ (తరువాత ఎంఎల్ ఏగా కూడా గెలచారు), ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్ విఎస్ ఆర్ కె ప్రసాద్ (ఏ టు జడ్ ప్రసాద్ అనే వాళ్లు) ఉన్నారు. అప్పట్లో వరంగల్ లో ఏకైక ఫ్రీలాన్స్ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ధనుంజయ్. ఒక్కోరోజు ధనుంజయ్ రావడం ఆలస్యమైతే ఆపూట ఆందోళనా కార్యక్రమం వాయిదా పడేది. నాలుగు ఫొటోలు ప్రింట్ చేయించుకుని బస్ స్టాండ్ కి పరిగెత్తి హైదరాబాద్ కు ఫొటోల కవర్ పంపి, టెలిప్రింటర్ లో రిపోర్టు పంపేవాడిని. ఏమాటకామాట.. ప్రజా స్వామ్య పరిరక్షణ ఉద్యమ కవరేజ్ లో ఇండియన్ ఎక్స్ ప్రెస్/ఆంద్రప్రభ ఎప్పుడూ వెనుకబడి ఉండేది కాదు.
ఉదయంలో నేను పొలిటికల్ రిపోర్టర్ గా పనిచేసిన రోజుల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి, ఇక కవరేజ్ కి కొదవేముంటుంది. పరుగులు పెట్టని రోజు ఉండేది కాదు. ఎన్టీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మొదట్లో రిపోర్టర్స్ కి పెద్ద వ్యాయామం చేసినట్టే. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిన్నపాటి వేదిక మీద కింద మఠం వేసుకుని మరీ కూర్చునే వారు, రిపోర్టర్స్ మాత్రం ఏం చేస్తాం, కింద కూర్చుకునే ఆయన చెప్పేది రాసుకునే వాళ్లం. తరువాత ఆ పద్ధతిలో మార్పు చేసి, కుర్చీలు వేయించారు.
నేను రెండు సందర్భాలల్లో ఎన్టీఆర్ తో ఎన్నికల ప్రచారంలో రిపోర్టింగ్ లో ఉన్నాను. ఆంద్రపత్రికలో నేను పనిచేసే రోజుల్లో (1986) హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. ఎన్టీఆర్ సిటీలో ప్రచారం… చైతన్య రథం ఉన్నట్టుండి చాదర్ ఘాట్ వంతెన దగ్గర ఉన్న పార్కు దగ్గర ఆగింది. ఎన్టీఆర్ దిగి వచ్చే లోపు.. సిబ్బంది ఆ పార్కులో ఓ పక్కన నాలుగు జంపకానాలు పరిచారు. ఏం జరుగుతోందా అని ఆశ్చర్యంగాచూస్తున్న రిపోర్టర్స్ ని దగ్గరకు రమ్మని పిలిచారు. అప్పటికే చైతన్య రథం నుంచి దింపిన క్యారేజ్ లలో నుంచి తినుబండారాలను బయటకు తీసిన ఎన్టీఆర్ మాకు కూడ ఇచ్చి తినండి బ్రదర్ అంటూ ఆప్యాయంగా తినిపించడమే కాకుండా ఒక్కో తినుబండారం రుచి గురించి చెబుతూంటే మరోమారు ఆశ్చర్య పోవలసి వచ్చింది. (ఇదంతా నేను ఆంద్రపత్రికలో రిపోర్టు చేసేను). గండిపేట తెలుగు విజయం (పార్టీ కేంద్ర కార్యాలయం కొంత కాలం అక్కడే ఉండేది)లో ఎన్టీఆర్ దగ్గర ఉండి ప్రతి వంటకం గురించి వివరిస్తూ తినిపించిన సందర్భాలను ఆరోజుల్లో రిపోర్టర్స్ కి ఓ ప్రివిలేజ్. గోంగూర పచ్చడి గురించి వర్ణన ఎన్టీఆర్ కే చెల్లు. ఆంధ్ర శాకాంబరి మాత గోంగూర పచ్చడి అంటూ ఊరగాయ రుచి తెగ వర్ణింటేవారు (నేను గోంగూర పచ్చడి తినను, ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ జాలిగా నా వంక చూసిన క్షణం నాకు ఇంకా గుర్తు ఉంది, ఆయన డైలాగులూ గుర్తు ఉన్నాయి). ఇక 1994 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రభ సీనియర్ రిపోర్టర్ గా ఎన్టీఆర్ చైతన్య రథం వెంట అనకాపల్లి నుంచి హిందూపూర్ వరకు ఏకబిగిన సాగిన ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారం కవరేజ్ చేసేను. ఆంద్రప్రభ మెయిన్ ఎడిషన్ తో పాటు నాలుగు పేజీల ఎన్నికల స్పెషల్ లో ఎన్టీఆర్ ప్రచారం హైలెట్స్ కవరేజ్ వార్తలు కోకొల్లలు నేను రిపోర్టు చేసినవే.
1996 జనవరి 18 గురువారం ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, 5 గంటల వేళ మా (ఆంధ్రప్రభ) చీఫ్ రిపోర్టర్ దేవులపల్లి అమర్ ఫోన్. ఇప్పుడే విజయకుమార్ (CPRO to CM Chandrababu) ఫోన్ చేసేడు ఎన్టీఆర్ పోయాడట, నువ్వు వచ్చేయ్..నేను బయలుదేరుతున్నా.. అంటూ ఫోన్ పెట్టేయడంతో బంజారాహిల్స్ కి పరుగులు. అంతేనా… ఎన్టీఆర్ చితా భస్మాన్ని పవిత్ర నదుల్లో కలిపే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో మంత్రులు తలా ఒక కలశాన్ని పట్టుకుని నదులవైపు ప్రయాణం కట్టేరు. హైదరాబాద్ నుంచి మంత్రుల బృందాలు చితాభస్మం ఉన్న కలశాలతో ఊరేగింపుగా బయలు దేరేయి, నేను బెజవాడ దిక్కుగా బయలుదేరిన మంత్రుల బృందం వెంట వెళ్లాలి. తీరా నేను హిమయత్ నగర్ లో వడ్డే శోభనాద్రీశ్వర రావు అధికార నివాసానికి వచ్చే సరికి అప్పటికే కలశాల యాత్ర బయలుదేరి అరగంట అయిందని తెలియడంతో..ఆర్టీసి బస్ స్టాండ్ వైపు పరుగులు పెట్టా. బస్సు ఎక్కి మొత్తం మీద జగ్గయ్యపేట దాటిన తరువాత కలశ యాత్రను అందుకోగలిగాను. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ పార్టీ కార్యకర్తల నినాదాల మధ్య కృష్ణా నదిలో ఎన్టీఆర్ అస్తికలను మంత్రుల బృందం నిమజ్జనం చేసిన వార్త కవర్ చేసి హైదరాబాద్ కు తిరుగుప్రయాణం కట్టేను. మొత్తం మీద ఎన్టీఆర్ చివరి వరకు అందరనీ పరుగులు పెట్టించేరు.
ఓ గొప్ప నాయకుడు.. అటువంటి నేత మరొకరు రారు.
– బుద్ధవరపు రామకృష్ణ (సీనియర్ జర్నలిస్టు) (ఫేస్ బుక్ టైమ్ లైన్ నుంచి)