బడ్జెట్ లో నవరత్నాలే హైలైట్

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ లో ముందునుండి చెబుతున్నట్లుగానే నవరత్నాల అమలుకే ప్రాధాన్యత ఇచ్చింది. నవరత్నాల్లో భాగమైన రైతులకు వ్యవసాయరంగం, నీటి పారుదల రంగం,  విద్యారంగం ప్రధానంగా పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, విద్యుత్ రంగం, మహిళా సంక్షేమానికే జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేసింది.

విద్యారంగానికి అత్యంత ప్రాధన్యత ఇస్తు  బడ్జెట్లో  రూ 32,618 కోట్లు కేటాయించారు ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి. ఇందులోనే ఉన్నతవిద్య, అమ్మఒడి, పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పన, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల నిర్వహణ గ్రాంటు తో పాటు ఇతర అవసరాలు కూడా కలిసే ఉన్నాయి.

అలాగే రైతాంగ సంక్షేమానికి సుమారు రూ. 19 వేల కోట్లు కేటాయించింది. ధరల స్ధిరీకరణ నిధికి రూ.  3 వేల కోట్లు, ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసాకు రూ .8750 కోట్లు, రైతులకు ఉచితంగా 9 గంటల విద్యుత్ అందించేందుకు రూ. 4525 కోట్లు కేటాయించారు.

గ్రామీణాభివృద్ధికి రూ. 29,329 కోట్లు, సాగునీరు, వరదనివారణకు రూ 13,139 కోట్లు, వైఎస్సార్ రైతు బీమాకు రూ 1163 కోట్లు, రైతుల ఉచిత బోర్లుకు రూ. 200 కోట్లు, ఆక్వా రైతుల ఉచిత విద్యుత్ సబ్సిడికి రూ. 475 కోట్లు కేటాయింపులు జరిగాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , పట్టణాభివృద్ధికి రూ. 6547 కోట్లు కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖకు రూ .11,399 కోట్లు కేటాయించారు.  మొత్తం మీద తొలి బడ్జెట్ లో జగన్ నవరత్నాల అమలుకే పెద్ద పీట వేశారు. మరి ఈ బడ్జెట్ పై టిడిపి ఎలా స్పందిస్తుందో చూడాలి.