ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కారణంగా జగన్ ప్రభుత్వం బుధవారం అనేక పత్రికలలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రకటనలు ఇవ్వటం జరిగింది. ” ఇవి పార్టీ రహిత ఎన్నికలు, పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు, మన పంచాయతీ ఎన్నికలు. పంచాయతీలు ఏకగ్రీవం చేసుకుందాం, గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం” అంటూ అనేక పత్రికలలో వచ్చిన ప్రకటన విమర్శలకు తావిచ్చింది. మొదటిగా పంచాయతీలను ఎన్నుకునే అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టకుండా ఏకగ్రీవం పేరుతో అధికార పార్టీ తమకు అనుకూలమైన అభ్యర్థులను ఎన్నిక చేయించుకోవడానికి ప్రయత్నిస్తోందని ఇతర పార్టీల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే దానితో పాటు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎంబ్లెమ్ కూడా సరి చూసుకోకుండా ప్రకటన ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో పంచాయతీలకు సంబంధించిన చిహ్నాన్ని మూడు చోట్ల వాడారు. వీటిల్లో రెండింటిలో సరిగానే ఉన్నప్పటికీ, మూడవ ఎంబ్లెమ్ మాత్రం తెలంగాణ గ్రామ పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన లోగోని వాడారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, లక్షల్లో జీతాలు తీసుకుంటున్న మీడియా సలహాదారులు కనీసం ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చిహ్నం ఏదో కూడా తెలియకుండా పనిచేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
ఆ పెట్టేదేదో ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఫోటో పెడితే బాగుంటుంది గానీ…. తెలంగాణ గ్రామ పంచాయతీ భవనం ఫోటో ఎందుకు సార్?@IPRAndhra pic.twitter.com/9MrXX4hNEQ
— srinivas kusampudi (@SriKusampudi) January 27, 2021