అవును చంద్రబాబునాయుడు మాస్టర్ ప్లాన్ ఇదే. పోయిన ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే ఇఫుడు కూడా అనుసరిస్తున్నారు. పోయిన ఎన్నికల్లో అంటే ప్రతిపక్షంలో ఉన్నపుడే ఆ పనిచేశారు. ఇపుడు అధికారంలో ఉన్నపుడు అవకాశాలను వదులుకుంటారా ? అందుకే ఎన్నికలు దగ్గర పడేకొద్దీ చంద్రబాబు పథకాల పేరుతో రెచ్చిపోతున్నారు. పసుపు కుంకుమ, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు, తాజాగా రైతుబంధు పేరుతో రైతులకు రూ 10 వేలు హామీలు ఇలాంటివే అనటంలో సందేహం లేదు.
ఇక్కడ విషయం ఏమిటంటే, చంద్రబాబు కురిపిస్తున్న వరాలు, ఇస్తున్న హామీల ఖర్చంతా కూడా జనాల నుండి పన్నుల రూపంలో వసూలు డబ్బే అన్న విషయం మరచిపోకూడదు. అందరూ కట్టే పన్ను డబ్బుతో కొంతమందికి లబ్ది చేకూర్చే పథకాలను చంద్రబాబు అమలు చేస్తానని హామీ ఇస్తున్నారు. ఒక్క చంద్రబాబే కాదు. ఏ ముఖ్యమంత్రయినా, ప్రధానమంత్రయినా చేసేదదే. కానీ ఇచ్చిన హామీలనైనా చంద్రబాబు సక్రమంగా అమలు చేశారా అంటే అదీ లేదు.
పోయిన ఎన్నికల్లో తానిచ్చిన హామీలనే చంద్రబాబు సంపూర్ణంగా అమలు చేయలేదన్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో హామీలే అలాగుంటే రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు మళ్ళీ పథకాలతో రెచ్చిపోతున్నారు. నిజానికి అప్పుడిచ్చిన హామీలైనా ఇఫ్పుడిస్తున్న హామీలైనా అమలు చేయటం చంద్రబాబుకు సాధ్యంకాదు. దాదాపు ఇటువంటి హామీలనే జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తున్నారు. మరి తాను అధికారంలోకి వస్తే ఎలా అమలు చేస్తాను అనే విషయమై జగన్ కూడా ఏవో లెక్కలు చెబుతున్నారు. మొత్తానికి జనం డబ్బులతో జనాల ఓట్లు కొనుగోలు చేయటంలో చంద్రబాబు ఆరితేరిపోయిన విషయం అర్ధమవుతోంది.