టిడిపి ఎంఎల్ఏలపై  అంత వ్యతిరేకతుందా ?

తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందా ? అవుననే అంటున్నారు సీనియ నేత, అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే జేసి పార్టీ తాజా పరిస్ధితిపైన కూడా వ్యాఖ్యలు చేశారు. 40 శాతం మంది ఎంఎల్ఏలు జనాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారట. అటువంటి వారిని పక్కనపెట్టకపోతే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవ్వటం కష్టమని కూడా చెబుతున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఏల స్ధానాల్లో మంచివాళ్ళను పోటీ చేయిస్తే చంద్రబాబు గెలుపును దేవుడు కూడా అడ్డుకోలేరని జోస్యం కూడా చెప్పారులేండి.

 

నిజానికి నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల్లోను వ్యతిరేకత పెరిగిపోయిన మాట వాస్తవం. యధారాజా తథా ప్రజా అన్నట్లు చంద్రబాబును బట్టే మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలుంటారు. ఇసుక, మట్టి ఒకటేమిటి ప్రతిదీ టిడిపి నేతలకు ఆదాయ వనరులుగా మారిపోయాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు, కేంద్ర, రాష్ట్ర పథకాల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. సంక్షేమ పథకాల్లో లబ్దిదారుల ఎంపికలో కూడా అక్రమాలే. దాంతో గ్రామస్ధాయి నుండి జనాల్లో చంద్రబాబు పాలనపై బాగా వ్యతిరేకత వచ్చేసింది.

 

వాస్తవాలిలా ఉంటే జేసి ఏమో చంద్రబాబును వెనకేసుకొస్తున్నారు. చంద్రబాబు మీద మాత్రం జనాల్లో ఎలాంటి వ్యతిరేకత లేదట. 40 శాతం మంది ఎంఎల్ఏల పైన మాత్రం వ్యతిరేకతుందంటే ఎవరైనా ఎలా అర్ధం చేసుకోవాలి ? జేసి చెప్పినట్లుగా 40 శాతం మంది ఎంఎల్ఏలంటే దాదాపు 45 మంది ఎంఎల్ఏలు.  అంతమందిని ఒకేసారి మార్చటం సాధ్యమవుతుందా ? ఒకవేళ అంతమందిని మార్చి కొత్తవారికి టిక్కెట్లిస్తే వాళ్ళు గెలవటం ఎలాగ ? టిక్కెట్లు రాని వాళ్ళు ఊరకుంటారా ? ఇతర పార్టీల్లోకి దూకేసి అక్కడి నుండి టక్కెట్లు తెచ్చుకోవటమో లేకపోతే టిడిపిలోనే ఉండి అభ్యర్ధుల వెనుక గోతులు తవ్వటమో చేయరా ?

 

అంతెందుకు తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి మీద కూడా పార్టీలోను, జనాల్లోను వ్యతరేకత ఉందని ప్రచారం జరుగుతోంది కదా ? అక్కడ ప్రభాకర్ రెడ్డికి కాకుండ మరొకరికి టిక్కెట్టిస్తే జేసి సోదరులు చూస్తు ఊరకుంటారా ? రేపు అనంతపురం ఎంపిగా తన కొడుకు గెలవటం కోసం పార్లమెంటు పరిధిలో తన మద్దతుదారులకు టిక్కెట్లిప్పించుకోవాలని దివాకర్ రెడ్డి అనుకుంటున్నది వాస్తవం. అందుకు సిట్టింగ్ ఎంఎల్ఏల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించలేదు. అందుకనే 40 శాతం మంది ఎంఎల్ఏలను మార్చాలనే స్లోగన్ మొదలుపెట్టినట్లుంది చూడబోతే.