బిగ్ బ్రేకింగ్ : జగన్ పై హత్యాయత్నం కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) కి   అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 25 న జగన్ పై విశాఖ ఏయిర్ పోర్టులో దాడి జరిగింది. శ్రీనివాస్ అనే యువకుడు జగన్ పై కోడి కత్తితో దాడి చేశాడు.  ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం కేసును కోర్టు ఎన్ఐఏకి అప్పగించింది. ఎన్ఐఏకి కేసు అప్పగించే విషయం పై నిర్ణయం చెప్పాలని గతంలోనే హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. దర్యాప్తు ఆలస్యమయితే సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన కోర్టు ఎన్ఐఏకి కేసు విచారణను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు మాత్రమే నిందితుడని, వెనుక మరెవరూ లేరని ఏపీ పోలీసు అధికారి లడ్డా వెల్లడించిన రెండు రోజుల్లోనే కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున కోర్టులో విచారణను జాతీయ సంస్థకు అప్పగించాలని పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. కాగా, ఈ కేసును విమానయాన చట్టాల ప్రకారం రిజిస్టర్ చేసి, సెక్షన్ 3 (ఏ) కింద నమోదు చేయాలన్న వారి అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. 

ఏపీ హైకోర్టు తీర్పు పై వైసిపి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని వారన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. వీటన్నింటిని తిప్పికొడుతూ హైకోర్టు తీర్పు నివ్వడం సంతోషించదగ్గ విషయమని ఇది టిడిపికి పెద్ద షాక్ అని వారు విమర్శించారు. ఎన్ఐఏకి కేసు అప్పగించడం ద్వారా అన్ని నిజాలు బయటికి వచ్చి అసలు దోషులకు శిక్ష పడుతుందనివారు ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్ధకు కేసును అప్పగించాలని వైసిపి ఎప్పటి నుంచో కోరుతూ వచ్చింది. ఇంత చిన్న విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాల్సిన అవసరమేముందని టిడిపి ఎద్దేవా చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు టిడిపికి బిగ్ షాక్ తగిలినట్టయ్యిందని వైసిపి నేతలు ఎద్దేవా చేశారు.   

అక్టోబర్ 25న పాదయాత్ర పూర్తి చేసుకొని హైద్రాబాద్ వచ్చేందుకు జగన్ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులోని హోటల్ లో పనిచేసే శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ తో సెల్ఫీ తీసుకుంటానని వచ్చి సెల్పీ తీసుకొని ఆ తర్వాత జగన్ చేతి పై కత్తితో దాడి చేశాడు. దీంతో జగన్ చేయికి గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన భద్రత సిబ్బంది శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. జగన్ హైదరాబాద్ చేరుకొని చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచి కేసు విచారణ రాష్ట్ర పోలీసు శాఖ చేస్తుంది. ఎయిర్ పోర్టు కేంద్ర సంస్థ కాబట్టి ఎన్ఐఏకి అప్పగించాలని వైసిపి డిమాండ్ చేసింది. జగన్ తరపు లాయర్ వాదనలతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు ఎన్ఐఏకి విచారణ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది.