టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న మంత్రి హరీష్ రావుకు ఇప్పుడు కొద్దిగంత రిలీఫ్ దొరికినట్లుంది. హమ్మయ్య అని ఆయన అనుచరులు, అభిమానులు, కేడర్ ఊపిరి పీల్చుకునే పరిస్థితి నెలకొంది. గత 25 రోజులుగా హరీష్ రావు టిఆర్ఎస్ పార్టీలో కనిపించని శత్రువుతో యుద్ధం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకున్నట్లు, సల్లబడుతున్నట్లు కనబడుతున్నా.. లోలోన బడబాగ్ని మాత్రం అట్లనే ఉంది.
టిఆర్ఎస్ పార్టీలో పెద్ద లీడర్ అయిన హరీష్ రావు విషయంలో ఏమైందో ఏమో కానీ అప్రకటిత నిషేధం విధించాయి టిఆర్ఎస్ అనుకూల మీడియా సంస్థలు నమస్తే తెలంగాణ, టిన్యూస్. సెప్టెంబరు 10వ తేదీ తర్వాత హరీష్ రావు బొమ్మ కానీ, వార్త కానీ నమస్తే తెలంగాణలో పతాక స్థాయిలో ప్రచురితం కాలేదు. పదో తేదీన వచ్చిన వార్తే మొదటి పేజీలో వచ్చింది. ఆ తర్వాత కట్టర్ బంద్. వస్తే గిస్తే లోపలి పేజీల్లో ప్రాధాన్యత లేని స్థాయిలో వార్తలు వేశారు. హరీష్ రావు వార్తలు కొన్ని అయితే జిల్లా టాబ్లాయిడ్ లోని జోన్ పేజీకే పరిమితం చేసిన దాఖలాలున్నాయి.
అదంతా గతం. చరిత్రలో కలిసిపోయినట్లే అని టిఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే తేలిపోయింది. గురువారం బేగంపేట క్యాంపు ఆఫీసులో జరిగిన సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటిఆర్, మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తారు. సిద్ధిపేట రికార్డును సిరిసిల్లలో కేటిఆర్ అధిగమించాలని హరీష్ రావు ఆకాంక్షించారు. మంత్రి కేటిఆర్ కూడా హరీష్ ను ఆకాశానికెత్తారు. తనకు హరీష్ రావే మార్గ నిర్దేశకుడు అన్నారు. ఇద్దరం అన్నాదమ్ముల మాదిరిగా కలిసి పెరిగామని సెలవిచ్చారు. ఈ వార్తకు నమస్తే పత్రిక బాగా ప్రాధాన్యత ఇచ్చింది. టాప్ ప్లేస్ కట్టబెట్టింది.

ఇదంతా బాగానే ఉన్నా కేటిఆర్ చేసిన ఒక కామెంట్ మాత్రం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అదేమంటే మరో 15 ఏళ్ల పాటు కేసిఆరే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉండాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కామెంట్ మీద రకరకాల ఊహాగానాలు, చర్చోప చర్చలు సాగుతున్నాయి. కేటిఆర్ ఇలాంటి డైలాగ్ కొట్టడం ఇప్పుడే మొదలుకాదు. గతంలోనూ చాలాసార్లు ఇలాంటి డైలాగ్ వాడారు. కానీ గతంలో అన్న మాటలకు ఈసారి అన్నమాటకు తేడా ఉంది.
ఎందుకంటే కేటిఆర్ కు పట్టాభిషేకం కోసమే ముందస్తు ఎన్నికల వచ్చాయని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కేసిఆర్ అసెంబ్లీకి రాజీనామా చేసి పార్లమెంటుకు పోటీ చేస్తారని, తద్వారా జాతీయ రాజకీయాల్లోకి 2019లో కేసిఆర్ పోతారని చర్చలు సాగుతున్నాయి. అయితే ముందస్తు ఎన్నికలు ముగియగానే కేటిఆర్ సిఎం అయితాడని ఒక చర్చ జరగ్గా, లేదు లేదు.. 2019 పార్లమెంటు ఎన్నికల వరకు కేసిఆరే సిఎంగా ఉండి ఆ తర్వాత ఆయన ఎంపిగా పోటీ చేసే సమయంలో కేటిఆర్ కు పగ్గాలు అప్పగిస్తారని ఒక రకమైన చర్చ కూడా ఉంది.
అయితే కేటిఆర్ ను సిఎం చేయడం హరీష్ రావుకు ఇష్టం ఉందా లేదా అన్న చర్చ కూడా ఉంది. కానీ ఒక ఇంటర్వ్యూలో కేటిఆర్ సిఎం అయినా తాను కలిసి పనిచేస్తానని, జై కేసిఆర్, జై కేటిఆర్ అనేదే తన నినాదమని కూడా హరీష్ రావు సుస్పష్టంగా ప్రకటించారు. ఇదంతా సరే. టిఆర్ఎస్ లో టాప్ ప్లేస్ లో ఉన్న హరీష్ రావుకు సెప్టెంబరు 10వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఎందుకు నమస్తే తెలంగాణ పత్రికలో నిషేధం విధించారో మాత్రం మిస్టరీగా మారింది. నమస్తే పత్రికలోనే కాదు టి న్యూస్ లో కూడా హరీష్ రావు ప్రసారాలు నిలిచిపోయాయి. అటూ, ఇటూగా నమస్తేతోపాటే టిన్యూస్ కూడా నిషేధం విధించింది.
మరి గత మూడు రోజులుగా కొద్ది కొద్దిగా హరీష్ రావు వార్తలు మెయిన్ పేజీలో కనబడుతున్నాయి. ఇగ కేటిఆర్ తో కలిసి సిరిసిల్ల మీటింగ్ పెట్టడంతో ఆ వార్తను మాత్రం హైలైట్ చేశారు. అందులో కేటిఆర్ ఉన్నారు కాబట్టి హైలైట్ చేశారా? అన్న ప్రశ్న కూడా ఉంది. రానున్న రోజుల్లో కేటిఆర్ లేకుండా హరీష్ ఒక్కడి వార్తలే ఎలా వస్తాయన్న ఆసక్తి జనాల్లో నెలకొంది.
హరీష్ రావు వార్తలు నమస్తే తెలంగాణ, టిన్యూస్ లలో రాకపోవడంతో టిఆర్ఎస్ లో ఉన్న ఆయన అభిమానులు, అనుచరులు ఆందోళన చెందారు. బాధపడ్డారు. ఎందుకు హరీష్ రావు మీద బ్యాన్ విధించారో మాత్రం వారికి అస్సలు అంతు చిక్కడంలేదు. ఏదో బలమైన విషయమే ఉండొచ్చని మాత్రం వారు అనుకుంటున్నారు.
హరీష్ రావుపై అప్రకటిత నిషేధం అనే కథనం కోసం కింద లింక్ క్లిక్ చేయండి.
https://bit.ly/2O3xmis