జగన్ ను తక్కువగా అంచనా వేస్తే కష్టమే.. మళ్లీ ఓటమి తప్పదంటూ?

ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వైసీపీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఆ వ్యతిరేకత తమ పార్టీలకు కలిసొస్తుందని ఈ రెండు పార్టీలు అనుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ రెండు పార్టీలకు భారీ షాకిస్తున్నాయి. వైసీపీని మించి సంక్షేమ పథకాలను అమలు చేయడం కష్టమని ఈ రెండు పార్టీలు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి.

జగన్ ను తక్కువగా అంచనా వేస్తే మాత్రం కష్టమేనని 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికలను మించి వైసీపీ విజయం సాధించేలా జగన్ అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ను అధికారానికి దూరం చేయాలని చంద్రబాబు, పవన్ భావిస్తున్నా అది తేలికైన విషయం కాదనే సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు తాజాగా ఆగ్రహంతో క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చారు.

అయితే 2024లో టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీని కాపాడేవారెవరనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ స్థానాన్ని భర్తీ చేయాలని బీజేపీ భావించడంతో పాటు ఆ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. 2019 ఎన్నికల్లో జగన్ ను తక్కువగా అంచనా వేయడం వల్లే తెలుగుదేశం పార్టీకి షాకింగ్ ఫలితాలు ఎదురయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వైసీపీ విముక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ అనే నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని రెండున్నరేళ్లు పవన్ రెండున్నరేళ్లు చంద్రబాబు సీఎంగా పాలన సాగించే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ పాలనపై విసుగు వచ్చి ప్రజలు 2019 ఎన్నికల్లో జగన్ ను గెలిపించారు. అయితే జగన్ మరీ అద్భుతాలు చేయకపోయినా పరవాలేదనే స్థాయిలో పాలనను కొనసాగిస్తున్నారు. జగన్ ను తక్కువగా అంచనా వేస్తే మాత్రం టీడీపీ, జనసేనలకు భారీ షాక్ తప్పదని చెప్పవచ్చు.