ఆమె కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు మంచి పేరు ఉంది. కానీ ఆ నాయకురాలికి డబ్బు మీద పుట్టిన ఆశతో దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఆమే బెంగళూరు కాంగ్రెస్ నాయకురాలు కె.టి.వీణ. దొంగతనం కేసులో వీణను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ వివరాలేంటంటే…
గదగ్ శాసనసభ స్థానం నుంచి పోటి చేసిన అనిల్ మెణసినకాయ తనకు చెందిన మూడు కోట్ల రూపాయల డబ్బును పరిచయస్తుల ఇంట్లో ఉంచాలని తన స్నేహితుడు హరిప్రసాద్ కు సూచించాడు. దీంతో హరి ప్రసాద్ బెంగళూరు రాజాజీ నగర్ లో ఉన్న తన సహోదరి సరోజా ఇంట్లో ఆ 3 కోట్ల రూపాయలను దాచాడు. సరోజా ఇంటికి ఆమె సమీప బంధువైన కెటి వీణ రెండు సార్లు వచ్చి వెళ్లింది. మాటలో మాటగా డబ్బువిషయాన్ని వీణాతో సరోజా చెప్పింది. సరోజాకు ఆ డబ్బుపై కన్ను పడింది.
కర్ణాటక శాసనసభ ఫలితాలు విడుదలైన మే 15న సరోజా తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో వీణా… నటరాజ్, బాబు అనే వ్యక్తులను సరోజా ఇంటికి పంపించి నగదు చోరికి పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీణాపై అనుమానం వ్యక్తం చేసిన సరోజా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్ పోలీసులు కేటి వీణాను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.