(యనమల నాగిరెడ్డి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి గా పదవీ భాద్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు అనుసరించిన ఆర్థిక విధానాలవల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి సహాయం చేయలేకపోయామని కేంద్ర హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.
కడప కందుల ఎస్టేట్ లో జరిగిన బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖుల సమావేశంలో కేంద్ర హోమ్ మంత్రి ముఖ్య అథిదిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన హిందీ ప్రసంగాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ అనువాదం చేశారు.
కేంద్రం అడిగిన సమాచారం సకాలంలో సక్రమంగా ఇవ్వకపోడం, ఆయన అనుసరించిన ఒంటెద్దు పోకడల వల్ల రాష్ట్రం నష్టపోయిందని ఆయన అన్నారు.
చంద్రబాబు రాష్ట్ర పాలనలో పారదర్శకంగా వ్యవహరించలేదని రాజనాథ్ అన్నారు. విభజన చట్టంమేరకు రాష్ట్రానికి రావలసిన అన్ని అంశాలను 80శాతం మేర మంజూరు చేసి అమలు చేశామని ఆయన ప్రకటించారు. 1985 తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వం లో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేస్తూ, సంకీర్ణ భాగస్వాములను కూడా తమతో నడిపించుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
కడప ఉక్కు ఫ్యాక్టరీకి చంద్రబాబే అడ్డంకి
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి కేద్రం కృత నిశ్చయం తో ఉందని, అయితే చంద్రబాబు ప్రభుత్వం అడిగిన సమాచారం అందివ్వలేదని హోం మంత్రి ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలన్న దృఢ సంకల్పంతో నే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి అధ్యయనం చేయించిందని, ఖనిజ లభ్యత లాంటి అంశాలపై రాష్ట్రం అడిగిన సమాచారం ఇవ్వలేదని ఆయన వివరించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ద్వారా ఏర్పాటు చేయించడాని కంటే చంద్రబాబు “జెడ్పీ వ్యతిరేక రాజకీయ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని” హోం మంత్రి రాజనాథ్ ఆరోపించారు. అలాగే రాష్ట్రానికి ఇంకా రావలసిన విభజన హామీలను అమలు చేయడానికి కేంద్రం సంసిద్దమని ,అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం తన సహకారం అందివ్వాల్సిన అవసరముందని ఆయన తెలిపారు.
ఎన్టీఆర్ కు ఘననివాళి
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ కు కేంద్ర హోం మంత్రి రాజనాథసింగ్ ఘానా నివాళి అర్పించారు. రామారావు తెలుగు వారి ఆత్మగౌరవ పరిరక్షణకు టీడీపీని ఏర్పాటుచేసి కాంగ్రెస్ తో యుద్ధం చేసి గెలిచారని, తన హయాంలో ఎన్టీఆర్ వ్యక్తులకంటే దేశ ప్రతిష్ట ను పెంచడానికే ప్రాధాన్యమిచ్చారని ఆయన వివరించారు. అల్లాంటి టీడీపీని చంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెసుతో కలపడంవల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మకు క్షోభ కలుగ కుండా, ఆయన ఏర్పరచిన లక్ష్యాలను సజీవంగా ఉంచడానికి బీజేపీ కృషి చేస్తుందని, ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగ చేస్తుందని రాజనాథ్ ప్రకటించారు.
కాంగ్రెస్ తో జత కలిస్తే ఉనికి గల్లంతే!
దేశ చరిత్రలో కాంగ్రెస్ తో జతకట్టిన రాజకీయ పార్టీ బ్రతికి బట్ట కట్టిన దాఖలాలు లేవన్న చారిత్రక సత్యాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు విస్మరించారని రాజనాథ సింగ్ అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు బీజేపీని వదలి కాంగ్రెస్ పంచన చేరారని, ఇందుకు అనేక కుంటిసాకులు చెపుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఐతే కాంగ్రెస్ తో జతకట్టినందుకు టీడీపీకి ఇటీవల ముగిసిన తెలంగాణా ఎన్నికలలో బాగా గుణపాఠం చెప్పారని, అయినా చంద్రబాబు తన గంతులు వదులు కోలేదని అయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తో జతకట్టిన బాబు భవిష్యత్తు రాజకీయాలలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోం మంత్రి సూచించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా 5 సంవత్సరాలపాటు నడిపి దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు గారని, ఆయన చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహానికి కాంగ్రెస్ చేసిన అవమానం, తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు మరచిపోయినా, భాద్యత కలిగిన తెలుగు ప్రజలు మరచిపోలేరని హోం మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో జాగ్రత్తగా ఉండాలని బీజేపీ మాజీ మిత్రుడు చంద్రబాబుకు ఆయన సూచింహారు.
మోడీపై ప్రశంసల జల్లు
ప్రధాని నరేంద్రమోడీ పాలన, పనితీరుపై కేంద్ర హోం మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు. ఆర్థికంగా ప్రపంచంలో 9 వ స్థానంలో ఉన్న భారతదేశం మోడీ నాలుగున్నరేళ్ల పాలనలో 6వ స్థానానికి చేరుకున్నదని , 2030 నాటికి ప్రపంచంలోని మూడు శక్తులలో ఒకటిగా ఎదుగుతుందని ఆయన తెలిపారు. దేశంలో పేదలందరికీ గూడు కల్పించడంలో కేంద్రం విజయవంతమైందని, పేదలకు, ప్రత్యేకించి మహిళలను బ్యాంకులతో అనుసంధానించడంలో, ఆరు కోట్లమంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం, ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించడం లాంటి అనేక కార్యక్రమాలను మోడీ ప్రభుత్వం విజయవంతంగా మేలు చేసిందని ఆయన ప్రకటించారు. అలాగే ఆర్ధిక నేరస్తుల భరతం పట్టడంలో కూడా కేంద్ర విజయం సాధించిందని హోం మంత్రి అన్నారు. వాచీ ఎన్నికలలో మోడీ నాయకత్వంలో బీజేపీ తిరిగి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అందుకోసం కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల వద్ద తమ శక్తీ యుక్తులను కేంద్రీకరించి పార్టీని బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఆ తర్వాత మాట్లాడిన బీజేపీ నాయకులు చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు.
సమావేశంలో రాయలసీమ నాలుగు జిల్లాల శక్తి కేంద్రాల ప్రముఖులు, బీజేప జాతీయ కార్యదర్సులు రాంమాధవ్, దియోధర్ , సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్సులు సురేష్ రెడ్డి, రవీంద్ర రాజు, ఉపాధ్యక్షులు కందుల రాజమోహన్ రెడ్డి, నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి,శాంతా రెడ్డి, చల్లపల్లె నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
