అవంతి-ఆమంచిలది అవకాశంవాదమైతే ఆ 23 ఫిరాయింపులేమిటి?

 
(వి. శంకరయ్య )
 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఈ మధ్య మతి మరుపు ఎక్కువగా వుందని పిస్తోంది. గతంలోని తన మాటలు పూర్తిగా మరచి పోయి తను తప్పు పట్టిన మాటలనే తిరిగి మాట్లాడి అబాసు పాలు అవుతున్నారు.
పాపం ఆయన చుట్టూ ఉన్న వారు కూడా సలహా ఇస్తున్నట్లు లేదు. అధినేత తప్పు చేస్తుంటే ద్వితీయ శ్రేణి నాయకులు ఏంచేస్తారు?కంచే చేను మేసితే… 
 
టిడిపి నుండి వలసలు మొదలైనవి. తాజాగా అవంతి శ్రీ నివాస్ ఆమంచి కృష్ణ మోహన్ వైసిపిలో నికి గోడ దూకారు. సహజంగా గోడ దూకే వారు చెప్పే మాటలు వారూ చెప్పారు. అవి పరిగణన లోనికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందు కంటే గతంలో కూడా వైసిపి నుండి టిడిపిలోనికి గోడ దూకిన వారు కూడా విపక్ష నేత జగన్ పై ఆరోపణలు చేశారు. ఇప్పుడు వీరు ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేస్తున్నారు.
 
కాని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పరస్పర విరుద్ధంగా వుంది. వారిద్దరిదీ అవకాశ వాద మన్నారు. తను 23 మంది వైసిపి ఎమ్మెల్యే లను చేర్చు కొన్నపుడు అవకాశవాదం కాదా? చోటా మోటా నేతల మాటలు పక్కన పెడతాం.
 
40 ఏళ్ల రాజకీయానుభవం కలిగి దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు మాటలు పరస్పర విరుద్ధంగా వున్నాయంటే మతి మరుపు అయినా వుండాలి. లేదా ఏ రోటి కాడ ఆ పాట పాడు తున్నారని భావించాలి. అంతే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు వున్న నేతగా వుండి ఇలా ఒక సారి కాదు. పలు మార్లు తప్పులో కాలు వేస్తుంటే ఏమని భావించాలి?
 
తెలుగు రాష్ట్రాల్లో తొలుత కెసిఆర్ పార్టీ ఫిరాయింపులకు తెర దీశారు. తదుపరి జంట నగరాల కార్పొరేషన్ ఎన్నికలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించారు. కాని నెలలు తిరగకముందే తను పార్టీ ఫిరాయింపులకు తెర దీశారు.
 
అంత వరకైతే ఫర్వా లేదు. తెలంగాణ ఎన్నికలలో ఫిరాయించిన వారిని చిత్తు చిత్తుగా ఓడించ మన్నారు.మరి రేపు ఎపిలో కూడా ఇదే ప్రసంగాలు చేస్తారేమో. అసంభవమేమీ కాదు. తరచూ మాటలు తడ బడు తున్నారు. 
రాజకీయ పరిణామాలు ఒక లాగా నేతలు ఆశించినట్లు జరగవు. ప్రస్తుతం ఎపిలో సీను రివర్స్ అయింది. టిడిపి నుండి వలసలు మొదలైనవి. దీనిని అవకాశ వాదం అంటే ప్రజలు ఏవగించు కుంటారని కూడా ముఖ్యమంత్రి భావించ కుండా మాట్లాడుతున్నారు. ఎవరు జేసిన కర్మ వారు అనుభవించక తప్పదు కదా?