చంద్రబాబు రక్తం ఉడికిపోతోందట..ఎందుకో తెలుసా ?

అత్త తిట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అనే సామెత లాగ అయిపోయింది చంద్రబాబునాయుడు పరిస్దితి. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక నేత వెంకయ్యనాయుడును క్యాబినెట్ లో నుండి పంపేశారంటూ చంద్రబాబు ఆక్రోశించారు. జరిగింది తలచుకుంటే రక్తం ఉడికిపోతోందట. అన్నీ రాష్ట్రాల్లోను తిరిగే వెంకయ్యను ప్రభుత్వం నుండి పక్కకు పెట్టేశారట. దక్షిణ భారతదేశంలో ఏ నేత బిజెపి గౌరవం ఇచ్చిందో చెప్పాలంటూ అసెంబ్లీలోని కమలంపార్టీ ఎంఎల్ఏలపై చంద్రబాబు రెచ్చిపోయారు.

కేంద్రప్రభుత్వ వైఖరి చూస్తుంటే తన రక్తం పొంగిపోతోందన్నారు. కేంద్రానికి తాము ఊడిగం చేసేవాళ్ళమా అంటూ ఆవేశంతో రెచ్చిపోయారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అసెంబ్లీలో జరిగిన చర్చపై తెచ్చుపెట్టుకున్న ఆవేశంతో చంద్రబాబు రెచ్చిపోయారు. నిజానికి సభలోని బిజెపి ఎంఎల్ఏలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఊగిపోయారు. వెంకయ్యను క్యాబినెట్లో నుండి పక్కన పెట్టేయటానికి రాష్ట్రంలోని బిజెపి ఎంఎల్ఏలకు ఏమన్నా సంబంధం ఉందా ?

అసలు వెంకయ్యను ఎలా ఉపయోగించుకోవాలన్నది బిజెపి అథిష్టానం ఇష్టం. మధ్యలో చంద్రబాబుకేంటి సంబంధం ? వెంకయ్య యాక్టివ్ గా ఉన్నంత కాలం చంద్రబాబుకు ఏ అవసరం వచ్చిన వెనకేసుకొచ్చేవారు. కేంద్రం ప్రభుత్వంలో కానీ ఢిల్లీ రాజకీయాల్లో కానీ చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకయ్యే చూసుకునేవారు. అసలు బిజెపిని సొంతంగా ఎదిగే అవకాశం లేకుండా వెంకయ్య, చంద్రబాబు కలిసి పార్టీని నాశనం చేశారంటూ రాష్ట్రం నుండి పార్టీ జాతీయ నాయకత్వానికి అనేక ఫిర్యాదులు కూడా అందాయని సమాచారం.

చంద్రబాబు, వెంకయ్య బంధాన్ని తెగొట్టేందుకే నరేంద్రమోడి అసలు వెంకయ్యను క్రియాశీల రాజకీయాల నుండి తప్పించి ఉపరాష్ట్రపతిగా పంపేశారన్నది నిజం. ఆ విషయాన్ని వెంకయ్య స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు. అంటే మోడి మీద కాదులేండి. ఉపరాష్ట్రపతిగా వెళ్ళటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని వెంకయ్య చాలాసార్లే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే వెంకయ్యను యాక్టివ్ రాజకీయాల నుండి తప్పించారో అప్పటి నుండే చంద్రబాబుకు ఢిల్లీలో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ ఉక్రోషమే చంద్రబాబు మొహంలో స్పష్టంగా కనబడింది. మోడిని ఏమీ అనలేక ఆ కోపాన్నంతిటినీ చివరకు అసెంబ్లీలోని బిజెపి ఎంఎల్ఏల మీద చూపారని అర్ధమైంది.

(ఫొటో సౌజన్యం ఏబిఎన్)