ఎన్నికల వేళ కీలక ప్రకటన చేసిన చంద్రబాబు

అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని కమిటీ ప్రజారంజక మేనిఫెస్టో తయారీలో తలమునకలైంది. ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్న టీడీపీ.. మళ్లీ అధికారంలోకి వస్తే కనీస పింఛనును రూ. 3 వేలకు పెంచాలని నిర్ణయించింది.

 గతంలో ఈ పింఛన్ రూ. 200 కాగా, ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని రూ. 2 వేలు చేసింది. ఇప్పుడు టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిచి మరోమారు అధికారంలోకి వస్తే దానిని మూడు వేలు చేస్తామని హామీ ఇవ్వబోతోంది. ఈ మేరకు మేనిఫెస్టోలో చేర్చినట్టు తెలుస్తోంది.

ఏపీ లో 3.91 కోట్ల మంది ఓటర్లు ఉంటే 98 లక్షల మంది ప్రజలకు పసుపు-కుంకుమ ఇచ్చామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు అంతా టీడీపీకి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో 65 లక్షల మందికి ఫించన్లు, నిరుద్యోగ భృతి ఇస్తున్నామని సీఎం చెప్పారు. దాదాపు 45 లక్షల మంది రైతులకు అన్నదాత-సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తున్నామనీ, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామని అన్నారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీలను అమలుచేయలేదని జగన్ అన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే జగన్ మాటలను తిప్పికొట్టేలా వాటిని సాధ్యం చేసి చూపామన్నారు. దీంతో ఇప్పుడు తానూ ఈ పథకాలను అమలుచేస్తానంటూ జగన్ చెబుతున్నారని ఎద్దేవాచేశారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు కుట్రలకు దిగుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.