ప్రజెంట్ ఆంద్రప్రదేశ్ పరిస్థితి ఏమిటని ఏ వ్యక్తిని అడిగినా చెప్పే మాట ఒక్కటే.. అప్పులు.. అప్పులు. అవును.. అప్పులు అనే విధానం మీదే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని లాక్కొస్తున్నారు. రెండు ముక్కలుగా విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక ఏపీకి 90 వేల కోట్ల అప్పు తప్ప ఏమీ మిగల్లేదు. గత ముఖ్యమంత్రి చంద్రబాబాబు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ పేరుతో నానా హంగామా చేశారు కానీ పెద్దగా ఆడాయవనరులను సృష్టించింది లేదు. సింగపూర్ మోడల్ చేతిలో పట్టుకుని తిరుగుతూ అమరావతిని భ్రమరావతిని చేశారు. దీంతో అప్పులు పెరిగాయి. నిర్వహణకు సైతం అప్పులు చేయాల్సి వచ్చింది. బాబుగారు దిగిపోయేనాటికి రాష్ట్రం అప్పులు రెండున్న లక్షల కోట్లకు పెరిగిందని కొత్త ప్రభుత్వం చెబుతోంది.
సరే.. కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమైనా అప్పులు లేకుండా ఆదాయ మార్గాలను అన్వేషించారా అంటే అదేం లేదు. మొదటి రోజు నుండి సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇచ్చిన జగన్ ఖజానాను కొద్ది నెలల్లోనే ఖాళీ చేసి కొత్త అప్పులు తేవడం మొదలుపెట్టారు. ఈలోపు కరోనా లాక్ డౌన్ కారణంగా ఉన్న కొద్దిపాటి ఆదాయం కూడ క్షీణించింది. ఇక పూర్తిగా అప్పుల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. వైఎస్ జగన్ సర్కార్ గడిచిన ఏడాదిలో సంక్షేమ పథకాల కింద 50 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని గొప్పగా చెప్పుకుంటోంది కానీ ఆ ఖర్చు ఎక్కడి నుండి తెచ్చి పెట్టారంటే అప్పుల ద్వారానే కదా. ఇక కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేక ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి కూడ సిద్దపడ్డారంటే సిట్యుయేషన్ ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.
మన రాష్ట్రానికి కాస్తోకూస్తో ఆదాయం తెచ్చిపెట్టే మార్గం ఏదైనా ఉంది అంటే అది మద్యం విక్రయాలే. కానీ ఆ కాస్త ఆదాయం నిర్వహణ ఖర్చులకు మూలకు కూడ చాలదు. ఇక జీఎస్టీ ఆదాయం కూడ పడిపోయింది కాబట్టి కేంద్రం నుండి పరిహారం రావాలి. కానీ కేంద్ర ప్రభుత్వం యాక్ట్ ఆఫ్ గాడ్ పేరు చెప్పి రుణాలు తీసుకునే పరిమితిని 3.5 శాతం నుండి 5 శాతానికి పెంచింది. ఈ పెంపుకు మన రాష్ట్రం అర్హత సాధించింది కూడ. ఇంకేముంది.. మరో ముప్పై వేల కోట్ల అప్పు కోసం వెతుకులాట మొదలైంది. ఇలా అప్పుల భారంతో నిత్యం నడ్డి విరుగుతున్న మన రాష్ట్రానికి అవే అప్పులతో కట్లు కడుతూ ఎలాగో ముందుకు లాక్కుపోతున్నారు వైఎస్ జగన్.