వైఎస్ జగన్ సర్కారుకి అమరావతి మాత్రమే ఏకైక అవకాశం

ఏకైక రాజధాని అమరావతి మాత్రమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ అనుకోవాలా.? ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్ సర్కార్, మూడో ఆలోచనని కాస్త పక్కన పెట్టక తప్పదా.? రాష్ట్ర రాజకీయాల్లో ఇదే విషయమై ఆసక్తకిరమైన చర్చ జరుగుతోంది. రెండున్నరేళ్ళ కాలంలో వైఎస్ జగన్ సర్కార్, రెండు రాజధానుల్ని అదనంగా నిర్మించడం సాధ్యమయ్యే పని కాదు. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనీ, కర్నూలుని జ్యుడీషియల్ క్యాపిటల్ అనీ, అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే, కోర్టు కేసుల కారణంగా ఆ నిర్ణయం అమలవడంలేదు. చూస్తూనే ఏడాది కాలంపైగా గడిచిపోయింది. ఇంకోపక్క అమరావతి ఉద్యమం 600 రోజులకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవాలంటే, ఏకైక రాజధాని అమరావతికే జై కొట్టక తప్పని పరిస్థితి.

2024 ఎన్నికల నాటికి, రెండు కొత్త రాజధానుల నిర్మాణం అనేది జరిగే పని కాదు. అదనంగా రెండు రాజధానుల నిర్మాణం జరగనప్పుడు ఏం చెప్పి, 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రజల ముందుకు వెళ్ళగలుగుతుంది.? ఏ రాజకీయ పార్టీకి అయినా ముందు చూపు అవసరం. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పదవిలో వుండాలనుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. ప్రతినెలా అప్పు చూస్తేనేగానీ, పూట గడవని దుస్థితి రాష్ట్రానికి వుంది. అలాంటప్పుడు, అదనంగా రెండు రాజధానులంటే అది సాధ్యమయ్యే పనేనా.? ఓ వైపు విపక్షాల విమర్శలతో సతమతమవుతున్న జగన్ సర్కార్, రేప్పొద్దున్న ప్రజల నుంచి సైతం ప్రశ్నలు దూసుకొస్తే ఏం చేయగలుగుతుంది.? అందుకే, వీలైనంత త్వరగా కీలక నిర్ణయం తీసుకుని, అమరావతి అభివృద్ధి దిశగా అడుగులు వేయడం మంచిది. ఒక్కసారి అమరావతి పనులు ముందుకు కదిలితే, ఆ తర్వాత మరో రెండు రాజధానుల్లో కదలిక ఆటోమేటిక్‌గా వస్తుంది. అది వైసీపీకి అదనపు అడ్వాంటేజ్ అవుతుంది కూడా.