ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని రాజకీయ పక్షాలు కేవలం రాజధాని అంశానికే పరిమితమై ఒకరికొకరు తన్నులాడుకోవడం పైగా ప్రజలను ప్రాంతాల వారీగా చీల్చడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఎంతో వెసులుబాటు కలిగింది. ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన చట్టం మేరకు వెనుక బడిన ప్రాంతాలకు రావాల్సిన నిధులు గురించి బిజెపిని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే వారే లేరు. ప్రాంతీయవాద మత్తులో పడి ప్రజలు కూడా మరచి పోయారు. అంతేకాదు, దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల్లో తుదకు బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా యన్ ఆర్ సి – యన్ పి ఆర్ – సిఏఏ ఫాసిస్ట్ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి భిన్నంగా వుంది. ముంచు కొస్తున్న మతోన్మాద పెనుభూతానికి తోడు కేంద్రం నుండి చట్ట బద్దంగా రావాల్సిన నిధుల కోసం ఒక్కరు పట్టించు కోకుండా పరస్పర హననంలో వున్నారు. అదే సమయంలో బిజెపి కూడా తను నిర్వర్తించ వలసిన కర్తవ్యాలు గాలికి వదలి పెట్టి రాజధాని రభస అసరా చేసుకొని పోరాటాలకు సిద్ధమౌతోంది. వాస్తవంలో ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన తీవ్ర మైన అన్యాయానికి నిరసనల సెగలు ఎదుర్కోవలసి బిజెపి నేతలు రాజధాని రచ్చ పుణ్యంతో హాపీగా తిరుగుతున్నారు. అడఫా దడఫా వామపక్షాలు సాగించే ఉద్యమాలు బిజెపికి చీమ కుట్టినట్టు కూడా లేదు.
ఎన్నికల ముందు 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించితే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన ముఖ్యమంత్రి తదనంతరం కాలంలో కథ అడ్డం తిరిగి నందున ప్రజాగ్రహం పక్క దారి పట్టించేందుకు రాజధాని రభస తెర మీదకు తెచ్చారనే అనుమానమూ లేక పోలేదు. ఫలితంగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం గజిబిజిగా తయారైంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బిజెపితో అమీతుమీ తేల్చుకొనే విధంగా కాంగ్రెస్ తో కలసి పోటీ చేశారు. ఎన్నికల అనంతరం ఘోర పరాజయంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమి ముప్పు వస్తుందనే భయంతో తుదకు పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ఓటు వేయించారు. ఒక పక్క దేశంలో మైనార్టీలు దళితులు బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా సానుభూతి కూడా వ్యక్తం చేయ లేని స్థితిలో ఉన్నారు.
మరో వేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు 25 పార్లమెంటు స్థానాలు కట్టబెడితే ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రజలను నమ్మ బలికారు. అటుఇటుగా 22 స్థానాల్లో ప్రజలు వైసిపి అభ్యర్థులను గెలిపించారు. తుదకు హామీలన్నీ గాలికి పోయాయి. వ్యూహాత్మకంగా రాజధాని రభస తెర మీదకు తెచ్చారు. . ప్రజలు కూడా ప్రాంతాల వారీగా చీలి పోయి రాజధాని మాకంటే మాకని ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారిని ద్వేషించే పరిస్థితి కలిగింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వ పని సులువు అయింది.జీవ నాడి పోలవరం ప్రాజెక్టు కొండెక్కింది. రాష్ట్రంలో ఇతర ఇరిగేషన్ పథకాల గురించి కాకుండా రాజధాని కోసం అన్ని జిల్లాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. వాస్తవంలో రాజధాని ఎక్కడున్నా సామాన్య జనాలకు ఒరిగేదేమీ లేదు. అయితే సెంటిమెంట్ రగిల్చారు. చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ లాగా ఈ సెంటిమెంట్ అన్నదమ్ములుగా వుండ వలసిన సామాన్య ప్రజల మధ్య చిచ్చు రగిల్చింది. మరోవైపు రాష్ట్రంలో తనకు ఆఖండ విజయం లభించడానికి కారకులైన మైనార్టీలు దళితుల వర్గానికి చెందిన సోదరులు దేశం మొత్తం మీద అతి క్రూరమైన విధానాలు అనుభవిస్తుంటే వారికి ఊరట కూడా చెప్పే సాహసం ముఖ్యమంత్రిలో లేదు. .జాతీయ అంశాలు పక్కన బెడితే ప్రత్యేక హోదా ఇస్తారా? లేదా అని నిలదీసే పరిస్థితి లేదు.
గమనార్హమైన అంశమేమంటే రాష్ట్ర విభజన చట్టం మేరకు తమ ప్రాంత సమగ్రాభివృద్ధికి ఉపకరించే వెనుక బడిన ప్రాంతాలకు కేంద్రం నుండి రావలసిన నిధులు గురించి ఈ ప్రాంతాల యువత డిమాండ్ చేయడం లేదు. గాని సెంట్ మెంట్ మత్తులో తన్నుకు లాడుతోంది. ఈ దుర్మార్గం ఇప్పటిది కాదు. గతం నుండి పాలకులు కల్పించారు. ఇప్పుడు పెరిగి మహా వృక్షం అవుతోంది. వెనుక బడిన ప్రాంతాల్లో కొందరు ప్రత్యేక హోదా అంటే తమకు ఉపకరించేది కాదనే ధోరణి కూడా రాష్ట్రంలో వుంది. ప్రత్యేక హోదా లభించితే పారిశ్రామిక వేత్తలు పరుగులు తీసి వచ్చి విరివిగా పరిశ్రమలు నెలకొల్పుతారని ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయనే భావన కన్పించక పోవడం విచారకరం. ఇందుకు ప్రాతిపదిక లేక పోలేదు. ప్రాంతీయ అసమానతలు వున్నంత వరకు ప్రత్యేక వాదం వెర్రి తలలు వేస్తూ వుంటుంది.
మరో నేత జన సేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగానే పోటీ చేశారు. అంత క్రితం కేంద్రాన్ని విమర్శిస్తూ పాచి పోయిన లడ్డు ఇచ్చిందన్నారు. మొన్నటి వరకు చే గువేరా గురించి ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు అమిత్ షా ఉత్తమోత్తమ శక్తి వంత మైన నేతగా మారి పోయారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన మతోన్మాద చట్టాలన్నీ దేశానికి అవసరమని కితాబు ఇచ్చారు. ప్రధాన మైన మూడు రాజకీయ పార్టీలు బిజెపి సేవలో తల మునకలుగా వున్నాయి. కనీసం రాష్ట్రానికి చట్ట బద్దంగా రావాల్సిన నిధులు కూడా కేంద్రాన్ని నిలదీయ లేని స్థితి రాష్ట్రంలో వుందీ.
వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు 9848394013