చంద్రబాబుని మించుతున్న జగన్

నవ్యాంధ్ర ప్రదేశ్ లో భారత దేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో నెలకొనని వైచిత్రి ఏర్పడింది. అధికార ప్రతి పక్షాలు వివిధ అంశాలపై పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఒకరు నువ్వు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావంటే మరొకరు నువ్వు రాష్ట్రాన్ని దివాలా తీయించు తున్నావని పరస్పరం ఆరోపణలు చేసు కొంటున్నారు. అంత వరకైతే ఫర్వాలేదు. మధ్యలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారు. సరిగ్గా తొమ్మిది నెలల క్రితం చంద్రబాబు నాయుడు ను కాదని జగన్మోహన్ రెడ్డికి పట్టం గట్టిన ప్రజలు అధికార ప్రతి పక్షాల పోట్లాటల మధ్య ప్రస్తుతం దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తనకు అధికారం అప్పగిస్తే సామాజిక ఫించన్లు మూడు వేలకు పెంచుతామని జగన్మోహన్ రెడ్డి చేసిన హామీ బాగా పని చేసింది. ప్రజలు పట్టం కట్టారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని క్రమేణా ఫింఛన్లు పెంచుతామని 2250 రూపాయలకు పెంచారు. ప్రజలు చేసేది లేక వచ్చిందే చాలని మిన్నకుండి పోయారు. అయితే ఉరుములు లేకుండా పిడుగులు పడినట్లు ఇంత వరకు ఫించన్లు పొందుతున్న వారిలో 4.26 లక్షల మంది అనర్హులని తొలగించి కొత్తగా 5.7 లక్షల మందికి ఫించన్లు ఇస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. అంటే ఈ ప్రభుత్వం అదనంగా 1.5 లక్షల మందికి మాత్రమే ఫించన్లు అదనంగా ఇస్తోంది. కాని ప్రతి పక్షాలు ఏడు లక్షల మందిని తొలగించారని చెబుతూ తొలగింపులన్నీ రాజకీయ కారణాలతో అని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా కొత్త వారి సంగతి అటుంచితే కనీసం అయిదు లక్షల మంది ఫించన్లు కోల్పోవడంపై మీడియాలో దయనీయ మైన కథనాలు వస్తున్నాయి.

ఇదిలా వుండగా తెలుగు దేశం హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని వైసిపి నేతలు తరచూ ఆరోపించే వారు. కాని ఇప్పుడు అప్పులు చేయడంలో ఎవరు గొప్పో ప్రజలు తేల్చుకోలేకున్నారు. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టే సమయానికి రాష్ట్రానికి 90 వేల కోట్లు అప్పు వుండగా అధికారం దిగే నాటికి 3.62 లక్షల కోట్లు అప్పు వుందంటున్నారు. అంటే అయిదు ఏళ్లలో 2.82 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రస్తుతం వైసిపి అధికారంలోనికి వచ్చిన తొమ్మిది నెలల్లో 47 100 కోట్ల రూపాయలు అప్పు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరొక మూడు నెలల కాలానికి ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుకు రాష్ట్రం టెండరు పెట్టి వుంది. అంటే సంవత్సరానికి సుమారు 54 వేల కోట్ల రూపాయల అప్పు చేసినట్లవుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం చేసిన అప్పుకన్నా మించి పోతుందని చెబుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో క్రమేణా రాష్ట్ర ఆదాయం పెరిగితే ఈ ఏడు లోటు ఎక్కువగా వుంది. నవ రత్నాలకు నిధులు కావాలి. ఆదాయం తక్కువ. ఖర్చులు ఎక్కువ. ఫలితంగా అప్పు మరింత చేయక తప్పదు.