‘కత్తి’ పోటుకు బెదురుతున్న సీఎం

 

‘కత్తి’ పోటుకు బెదురుతున్న సీఎం

 
ఎమ్మెల్యేల రాజీనామాలు, ఉపఎన్నికల అనంతరం కొంత ప్రశాంతంగానే నడిచిన కర్ణాటక రాజకీయం మళ్లీ వేడెక్కింది.  సీఎం యడ్యూరప్ప ప్రభుత్వానికి గండం పుడుతోందనే వార్తలు బలంగా వినబడుతున్నాయి.  అయితే ఈసారి ఆ గండం సొంత పార్టీ నుండే ఉండనుందట.  పార్టీ కీలక నేతల్లో ఇకరైన ఉమేశ్ కత్తి ఈ గండానికి ప్రధాన కారణం.  తనకు మంత్రి పదవి ఇవ్వలేదని గుర్రుగా ఉన్న ఉమేశ్ కత్తి గురువారం తన నివాసంలో కొందరు కీలక నేతలతో సమావేశం నిర్వహించారు.  అయితే ఈ సమావేశం గురించి సీఎం యడ్యూరప్పకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో పార్టీలో తిరుగుబాటు మొదలవుతోందని రాజకీయ వర్గాలు చెప్పుకుంతున్నాయి. 
 
ఉమేశ్ కత్తి రహస్య సమావేశంలో పాల్గొన్న నేతల్లో 
విజయపుర ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌, బాలచంద్ర జార్కిహొళి (అరబావి), శివరాజ్‌ పాటిల్‌ (రాయచూరు), రాజుగౌడ (సురపుర), అప్పుగౌడ (కలబుర్గి దక్షిణ), రాజ్‌కుమార్‌ పాటిల్‌ (సేడం), సుభాష్‌ గుత్తేదార్‌ (అలంద), బసవరాజ్‌ మత్తిమడు (కలబుర్గి గ్రామీణ), పరణ్ణా మునహళ్ళి (గంగావతి), సోమలింగప్ప (సిరుగుప్ప), మహదేవప్ప యాదవాడ(రామదుర్గ) లాంటి కీలక నేతలున్నారు.  వీరిలో కొందరికి మంత్రి పదవి దక్కలేదనే అసహనం ఉంది. 
 
ఇప్పుడు వీరంతా కలిసి తిరుగుబాటుకు దిగితే యడ్యూరప్ప పదవికి పెద్ద గండం తలెత్తుతుంది.  దీంతో అప్రమత్తమైన ఆయన ఉమేశ్ కత్తిని తన ఇంటికి ఆహ్వానించి చర్చలు కూడా జరిపారు.  చర్చల అనంతరం కత్తి తాము నిర్వహించిన సమావేశంలో ఎలాంటి రాజకీయాలు లేవన్నా ఆయన పూర్తిగా శాంతించలేదని టాక్.  యడ్యూరప్ప అయితే కత్తికి మంత్రి పదవి ఇస్తే బసనగౌడ పాటిల్ యత్నాళ్ లాంటి సీనియర్ నేతలు ఇంకొందరు కూడా పదవి డిమాండ్ చేస్తారు.  అప్పుడు మంత్రి వర్గం మొత్తాన్ని కదపాల్సి ఉంటుంది.  అది మరింత ప్రమాదకరం.  ఆ వర్గంలో పిరాయింపు నేతలు దండిగా ఉన్నారు.  వారిని కనుక కదిలిస్తే ఆలస్యం లేకుండా ప్రభుత్వం కష్టాల్లో పడిపోతుంది.  దీంతో యడ్యూరప్ప ఎప్పుడెప్పుడు తిరుగుబాటు మొదలవుతుందా తన పదవికి గండం వాటిల్లుతుందా అని సతమతమవుతున్నారు.