ఆంధ్రప్రదేశ్ టిడిపి నాయకులకు సర్వేల భయం పట్టుకుంది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ చంద్రబాబు చేయిస్తున్న సర్వేలతో నాయకులు ఒణికిపోతున్నారు. టిడిపి నేతలపై గత కొద్ది రోజులుగా ఐవీఆర్ఎస్ ద్వారా టిడిపి పెద్దలు అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. దీంతో కార్యకర్తలు, ప్రజలు తమపై ఎలాంటి అభిప్రాయం చెబుతున్నారో అని నేతలు మదనపడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి కార్యకర్తలకు, ప్రజల సెల్ ఫోన్లకు నేరుగా సీఎం చంద్రబాబునాయుడు ఫోన్ చేసినట్టుగా కాల్స్ వస్తున్నాయి. ఆ వాయిస్ కాల్ లో నమస్కారం తమ్ముడు, నమస్కారం చెల్లెమ్మ అంటూ చంద్రబాబు వారిని పలుకరిస్తాడు. ఆ తర్వాత ప్రభుత్వ పథకాల తీరు నచ్చితే ఒక బటన్ లేకుంటే ఇంకొ బటన్ నొక్కమంటాడు. తర్వాత మీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంఛార్జీ పనితీరుపై మరో సారి అభిప్రాయం కోరుతాడు. దీని ద్వారా పార్టీ ఆఫీసులో ఉన్న సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం నోట్ చేసి పెడతారు. దీంతో నేతల జాతకమంతా అందులో రికార్డు అవుతుంది.
జమిలి ఎన్నికలు వస్తాయని వార్తలు రావడం, సాధారణ ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో టిడిపి ఇప్పటి నుంచే అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే టిడిపి అధిష్టానం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుంది. దీని ద్వారా లోపాలను తెలుసుకుని పార్టీ అభివృద్దికి అనుసరించాల్సిన వ్యూహలను రచించే అవకాశం ఉంటుదని టిడిపి నేతల అభిప్రాయం. ఎమ్మెల్యేలు లేని స్థానంలో ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ నియోజకవర్గాలలో కూడా గెలవాలని టిడిపి భావిస్తుంది.
ఇంత వరకు బాగానే ఉన్నా టిడిపి చేస్తున్న సర్వేలతో నేతలలో, ఎమ్మెల్యేలలో గుబులు మొదలైంది. ఈ అభిప్రాయ సేకరణలో ప్రజలు తమకు అనుకూలంగా నిర్ణయం చెబుతున్నారో లేక వ్యతిరేకంగా చెబుతున్నారో అని వారు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే నేతలకు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఇప్పటికే క్లాసు తీసుకున్నారు. పనితీరు బాగాలేకుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కవని ఆయన నేతలకు హెచ్చరికలు చేశారు. అందులో భాగంగానే చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. పార్టీ కోసం జెండా ఎత్తుకుని పనిచేసే నేతలకే టిక్కెట్లు దక్కుతాయని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు.
2014 ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓటమి పాలయ్యిందో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పశ్చిమ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇతర పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలతోటి ఇప్పటికే టిడిపి ముఖ్యులు చర్చలు జరుపినట్టుగా తెలుస్తోంది. అలాగే టిడిపి నుంచి వెళ్లిపోయిన నేతలను కూడా తిరిగి సొంత గూటికి తీసుకొచ్చేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. అందుకే చంద్రబాబునాయుడు ప్రభుత్వ పనులలో బిజిగా ఉన్నా కూడా నిత్యం జిల్లా నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారని టిడిపి నేతల ద్వారా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఇంత సీరియస్ గా దృష్టి పెట్టడంతో టిడిపి నేతల్లో సర్వేల భయం పట్టుకుంది.
చంద్రబాబు నాయుడు సర్వేల నాటకం ఆడుతున్నారని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తుంది. ప్రజల్లో గుర్తింపు ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి సర్వేల పేరు చెప్పి నేతలను ప్రజల మధ్యకు పంపే ప్రయత్నం చేస్తుందని, ఎన్నికల భయంతోనే టిడిపి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.