ఏపీలో తుపాను తుపాన్ తాకిడికి రైతుల కలలన్నీ నీటిలో కలిసిపోయాయి. ‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు, కుండపోత వర్షాలు వరి పొలాలను ముంచెత్తాయి. ముఖ్యంగా బాపట్ల, వేమూరు, రేపల్లె, తెనాలి పరిసరాల్లో వేల ఎకరాల వరి పంట నేలమట్టమైంది. కంకుల దశకు వచ్చిన వరి మొక్కలు నీటిలో తేలుతూ ఉండగా, రైతుల కళ్లలో కన్నీటి ధారలు పారుతున్నాయి.
ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ల ముందే పోతుంటే గుండె పగలక మానదు అంటున్నారు రైతులు. ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయల వరకు నష్టం జరిగిందని వారు వాపోతున్నారు. ముందుగా 40 బస్తాలు దిగుబడి రావాల్సిన పొలాలు ఇప్పుడు 10 నుండి 15 బస్తాలకు కూడా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. నీరు నిల్వ ఉండిపోవడం.. ఇసుక పేరుకు పోవడంతో భవిష్యత్ పంటలకు కూడా ముప్పు ఉందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.
తుఫాన్ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై కూడా తీవ్రంగా పడింది. గోదావరి పరీవాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. కంటిన్యూగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక గ్రామాల్లో రవాణా స్తంభించింది. వరి పంటలు, వేపపంటలు, కూరగాయల సాగులు నాశనమై రైతులు కంగారుపడుతున్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం. కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఇక పంట నష్టాన్ని అంచనా వేయడానికి డ్రోన్ల సాయాన్ని తీసుకుంటున్నట్లు వివరించారు.
మొత్తంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా 15కి పైగా మండలాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోగా, పశువుల మరణాలు కూడా నమోదయ్యాయి. వర్షాల తీవ్రత తగ్గినా, నీటిమట్టం ఇంకా తగ్గకపోవడంతో రైతుల ఆందోళన కొనసాగుతోంది.
ఇంత పెద్ద నష్టం ఎప్పుడూ చూడలేదు. ఎకరానికి వందల కిలోల వరి నీటిలో కలిసిపోయింది. మా జీవితం మొత్తం ఈ పంటపైనే ఆధారపడి ఉంది.. అంటూ గుంటూరు జిల్లా రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు తక్షణ సహాయం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. తుఫాన్ తగ్గిపోయినప్పటికీ, దాని గాయాలు మాత్రం రైతు గుండెల్లో ముద్రపడ్డాయి.
