ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఎట్టకేలకు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ప్రివిలేజ్ కమిటీ వెల్లడించింది. కమిటీ ముందు అచ్చెన్నాయుడు హాజరై, తన వ్యాఖ్యలు ఉప సంహరించుకుంటున్నట్లు చెప్పారని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. అచ్చెన్న వివరణను కమిటీ సభ్యులకు పంపిస్తామనీ, కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామనీ కాకాని చెప్పుకొచ్చారు. మరో టీడీపీ నేత కూన రవికుమార్ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. కమిటీ యెదుట ఆయన ఇంకా విచారణకు హాజరు కాలేదు. విచారణకు మరింత సమయం కోరారు కూన రవి కుమార్.
ఇదిలా వుంటే, టీడీపీకి చెందిన మరో నేత రామానాయుడిపైనా ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది. గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పైనా ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదులు అందగా, ఆయనపైనా విచారణ జరుగుతుంది. ఈ నెల 21న జరిగే సమావేశంలో ఈ వ్యవహారాలపై నిర్ణయం తీసుకుంటామని అంటున్నారు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి. కాగా, తన వ్యాఖ్యల్ని ఉప సంహరించుకునే క్రమంలో అచ్చెన్నాయుడు హై డ్రామాకి తెరలేపారు. అయితే, అచ్చెన్న సహా కూన రవికుమార్ విషయమై ప్రివిలేజ్ కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దాంతో, అచ్చెన్న దిగి రాక తప్పలేదు. మరోపక్క అచ్చెన్న, తన వెంట న్యాయవాదిని తీసుకురాగా, ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ నేత జోగి రమేష్, అచ్చెన్నాయుడిపై ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ప్రివిలేజ్ కమిటీ వ్యవహారాలకు సంబంధించి, రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తుంటాయి. అధికారంలో వున్నవారు తమకు అనుకూలంగా ఆ కమిటీని వాడుకుంటారనే ఆరోపణ ఈనాటిది కాదు.