పద్మశ్రీ డివిఎస్ రాజు సదా స్మరణీయుడు

ప్రఖ్యాత నిర్మాత, తెలుగు సినిమా భీష్ముడు  పద్మశ్రీ డివిఎస్ రాజు గారి 90వ జన్మదినం . తెలుగు సినిమాకు డివిఎస్  రాజు చేసిన సేవ అపూర్వం , అనన్య సామాన్యం . తెలుగు సినిమా ప్రస్థానంలో రాజు గారి కృషి ఎప్పటికీ మిగిలే ఉంటుంది . 13 డిసెంబర్ 1928లో తూర్పు గోదావరి జిల్లా అల్లవరం బలరామరాజు , శుభద్రాయమ్మ దంపతులకు జన్మించారు .

చదువు అనంతరం మద్రాస్ వెళ్లి సినీ లితో ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు . ఇది సినిమా రంగంతో అనుబంధ పరిశ్రమ కాబట్టి  ఎన్ . టి  రామారావు గారితో పరిచయం ఏర్పడింది . రాజు గారి వ్యక్తిత్వం , నిజాయితీ  రామారావు గారికి బాగా నచ్చింది . అందుకే వారు స్థాపించిన ఎన్ .ఏ .టి లో భాగస్వామిగా రాజు గారిని చేరుకున్నారు . అదే రాజు గారి జీవితాన్ని మలుపుతిప్పింది .

1953లో “తోడు దొంగలు ” సినిమాతో వారి అనుబంధం మొదలైంది . ఆ సంస్థపై అనేక సినిమాలు నిర్మించారు .

ఆ తరువాత 1954లో డివిఎస్  సంస్థ ప్రారంభించి ” రామారావు ,  జమున తో  విఠలాచార్య దర్శకత్వంలో మొదటి సినిమా రూపొందించారు .

ఒక వైపు నిర్మాతగా కొన సాగుతూనే రామారావు గారితో సన్నిహితంగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేశారు  రాజు గారు .

రాయల సీమ కరువు , చైనా యుద్ధం , దివిసీమ తుపాను ఇలా ప్రజలకు ఏ కష్టం కలిగినా ఎన్టీ  రామారావు ముందు ఉండి  సినిమా రంగాన్ని అంతా ఒక త్రాటి మీదకు తెచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు . ఈ కార్యక్రమాలన్నీ రాజు గారికే అప్పగించేవాడు .

మరో వైపున నిర్మాతల మండలి , ఆంధ్ర ప్రదేశ్   చిత్ర వాణిజ్య మండలి, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి , ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి , సంస్థ, జాతీయ చలన చిత్ర అభివృద్ధి సంస్థ లాంటి వాటికి నేతృత్వం వహించి వాటి ఎదుగుదలకు రాజు గారు చేసిన కృషి ఎంతో వుంది .

రిచర్డ్ అటెన్  బరో  దర్శకత్వం వహించిన “గాంధీ ” చిత్ర నిర్మాణంలో రాజు గారు చిరస్మరణీయమైన పాత్ర పోషించాడు . ఆయనప్పుడు ఎన్ .ఎఫ్ .డి .సి  అధక్షులుగా వున్నారు . ఆ చిత్రం లో వచ్చిన లాభాల్లో  5 శాతం భారత సినిమా రంగ కార్మికులకు ఇవ్వాలని అటెన్  బరో  ను రాజు గారు ఒప్పించారు . అలా ఆరోజుల్లో మూడు కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ లో వేయించారు . ఇది రాజు గారి దక్షతకు నిదర్శనం .

1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత 1986లో హైద్రాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అద్భుతంగా జరిగింది . ఆ చిత్రోత్సవం  అత్యంత ఘనంగా  జరగడానికి ఎన్టీఆర్ రాజు గారుకిచ్చిన ప్రోత్సహమే . అలాగే ఫిలిం నగర్ గృహ నిర్మాణ సంస్థకు అధ్యక్షులుగా , ఫిలిం నగర్ కల్చరల్  సెంటర్ స్థాపకుడుగా డివిఎస్ చేసిన కృషి మరువలేము . తెలుగు సినిమా ప్రగతిలో డివిఎస్ కృషి వుంది . తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైద్రాబాద్లో స్థిరపడటానికి కృషి చేసిన వారిలో రాజుగారు వున్నారు .

ఎన్ . టి. రామారావు  డివిఎస్ ను స్వంత  సోదరుడిగా భావించేవాడు . రాజు గారి ఇంట్లో ఏ శుభ కార్యక్రమం జరిగినా రామారావు ముందు నిలబడి అతిధులను ఆహ్వానించే వాడు .. వారి అపూర్వ మైత్రి  చివరి వరకు కొన  సాగింది .

భారత సినిమా రంగానికి  డివిఎస్   సేవలను గుర్తించి ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు, భీష్మ అవార్డు  పద్మశ్రీ అవార్డు లభించాయి  .

తెలుగు సినిమా రంగంలో ఒక నిర్మాతకు పద్మశ్రీ రావడం అనే గౌరవం డివిఎస్ కె దక్కింది . 1910 నవంబర్ 13న 81 సంవత్సరాల వయసులో ఇహలోక యాత్ర ముగించారు . డివిఎస్ రాజు సినిమా రంగానికి చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి . డివిఎస్ సినిమావారికి సదా స్ఫూర్తి ప్రదాత .

-భగీరథ