భారతీయ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తుతూ బాలీవుడ్‌కు జీవం పోసిన లెజెండరీ స్టార్ ధర్మేంద్ర సింగ్ డియోల్ (Dharmendra Singh Deol) 89 ఏళ్ల వయస్సులో ఈరోజు తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించినట్లు జాతీయ మీడియా సంస్థలు ధృవీకరించాయి. హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర కన్నుమూశారన్న వార్త దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
1960లలో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ధర్మేంద్ర, తన ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 300కు పైగా చిత్రాల్లో నటించి భారతీయ సినీ చరిత్రను కొత్త పుంతలు తొక్కించారు. రొమాంటిక్ హీరోగా ప్రేక్షకుల మనసును దోచుకున్న ఆయన, యాక్షన్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చారు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా, పీరియడ్ రోల్స్.. ఎలాంటి పాత్ర ఇచ్చినా ఒదిగిపోయే ఆయన నటనా నైపుణ్యం తరతరాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ధర్మేంద్ర కెరీర్‌లో నిలిచిపోయే మాస్టర్‌పీస్ 1975లో విడుదలైన ‘షోలే’. వీరు పాత్రలో చేసిన అతని అల్లరి, అమాయకత్వం, భావోద్వేగం భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఫూల్ ఔర్ పత్తర్, మేరా గావ్ మేరా దేశ్, శరీ బద్మాష్, యమ్‌లా పగ్లా దీవానా వంటి చిత్రాలు ఆయన వైవిధ్యభరితమైన నటనకు అద్దం పట్టాయి. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, తెరపై సహజత్వం, ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించే శైలి.. ఇవన్నీ ఆయనను ఎప్పటికీ ఫేడవ్వని లెజెండ్ గా నిలిపాయి.
చలనచిత్రాలకు ఎన్నో విలువైన సేవలు అందించిన ధర్మేంద్రకు 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2012లో దేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించాయి. నటుడిగానే కాకుండా నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, అలాగే మానవతావాదిగా ఆయనకు ఉన్న పేరు ప్రత్యేకం. ధర్మేంద్ర మృతవార్త తెలిసిన వెంటనే సినీనటులు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తండోపతండాలుగా ఆయన నివాసానికి చేరుకున్నారు. నటుడు ఆమిర్ ఖాన్, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వ్యక్తిగతంగా వెళ్లి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇది భారతీయ సినిమాకు ఇది పూడ్చలేని లోటు.. అని పలువురు ప్రముఖులు విచారాన్ని వ్యక్తం చేశారు.
తన హాస్యం, దయ, వినయంతో అందరి హృదయాలను గెలుచుకున్న ధర్మేంద్ర.. ఇక శాశ్వత నిద్రలోకి జారిపోయారు. అయితే ఆయన చేసిన సినిమాలు, ఆయన పోషించిన పాత్రలు, ఆయన పంచిన చిరునవ్వులు.. భారతీయ సినీప్రియుల హృదయాల్లో ఎప్పటికీ వెలుగులీనుతూనే ఉంటాయి. ధర్మేంద్ర ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులంతా ప్రార్థిస్తున్నారు.
