విషయం లేని విజువల్ క్వాలిటీ (‘శుభలేఖ+లు’ రివ్యూ)

―సికిందర్
***
కొత్త వాళ్ళతో కొత్త సినిమా వచ్చింది. ఇంటినిండా నటీనటులతో పెళ్లి సినిమా వచ్చింది. ఒకటి కాదు, రెండు పెళ్ళిళ్ళ శభలేఖలు ఆహ్వానాలుగా పంపారు. మరి ప్రేక్షకులు సిద్ధమేనా? ఓటర్ల లిస్టుల్లో పేర్లు గల్లంతు కావచ్చుగానీ, ఈ పెళ్లి శుభలేఖల మీద ప్రేక్షకులందరి పేర్లూ వున్నాయి. టికెట్లు మాత్రం కొనాల్సిందే. డిస్కౌంట్ లేదు. ఈ పెళ్ళిళ్ళ మీద రౌండప్ కావాలంటే ఈ కింద ఓ లుక్కేయాల్సిందే.

కథ

నిత్య (ప్రియా వడ్లమాని) కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ చైన్ స్మోకర్ గా ఆధునిక భావాలతో వుంటుంది. ఆమెకి మోహన్ అనే ఎన్నారైతో పెళ్లి నిశ్చయిస్తారు. కానీ ఆమె పెద్దలు చూసే ముక్కూ మొహం తెలియని వాడితో పెళ్ళికి వ్యతిరేకం. వేరే తనకి నచ్చిన పెళ్ళయిన వాడితో రిలేషన్ షిప్ లో వుంటుంది. అతడి విడాకుల కేసు ఇంకా తెమలదు. ఓ రోజు విడాకులైపోయాయని చెప్తే అతడితో పారిపోతుంది. కానీ అతను విడాకుల గురించి అబద్ధం చెప్పానని చెప్పేసరికి ఇరకాటంలో పడుతుంది. ఈ పరిస్థితి నుంచి ఆమెని చందూ (సాయిశ్రీనివాస్) తప్పించి మోహన్ తో కలుపుతాడు.

 

చందూ నిత్యా ఒకే తండ్రి సంతానం. చందూ తల్లి చనిపోతే తండ్రి రెండో పెళ్లి చేసుకుని కన్న సంతానం నిత్య. అంటే చందూ నిత్యకి అన్నవుతాడు. అతణ్ణి సవతితల్లి హీనంగా చూస్తూంటుంది. మరోపక్క చందూని మేనత్త వాణి (ప్రియదర్శినీ కృష్ణ) కూతురు సిరి (దీక్షా శర్మ) ప్రేమిస్తూంటుంది. కానీ చందూ మ్యూజిక్ లో కెరీర్ అంటూ ఆమెని పట్టించుకోడు. ఆమెకి ఇంకో ఎన్నారై సంబంధం చూస్తారు. చందూ ఇరకాటంలో పడతాడు. ఇప్పుడు అటు నిత్య, ఇటు చందూ సిరీల సమస్యలు ఎలా తీరాయనేది మిగతాకథ.

ఎలావుంది కథ

ఇది ఒకప్పుడు, అంటే 2000 – 2005 మధ్య యూత్ సినిమాల పేరుతో రాజ్యమేలిన ‘లైటర్ వీన్ లవ్ స్టోరీస్’ అనే బలహీన సబ్ జానర్ కి చెందిన రోమాంటిక్ డ్రామా అన్పిస్తుంది కానీ కాదు. రోమాన్స్ కంటే కూడా ఇందులో ఇంటినిండా పది పదిహేనుమంది పెద్దవాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ డ్రామాగానే వుంటుంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో బలహీనమైన లైటర్ వీన్ రోమాంటిక్ డ్రామా అంతంత మాత్రంగా చూపిస్తారు. రోమాంటిక్ కామెడీ లక్షణమైతే ప్రేమికుల మధ్య పెద్దవాళ్ళ జోక్యం వుండదు. ఇలా మంచి యూత్ అప్పీల్ తో వుండే రోమాంటిక్ కామెడీలకి కరెక్ట్ నిర్వచనం అప్పట్లో జంధ్యాల తీసిన ‘అహ నా పెళ్ళంట’ సహా ఆయన తీసిన అన్ని ప్రేమ సినిమాలూ వున్నాయి.

 

రోమాంటిక్ డ్రామాల్లో ప్రేమికుల నిర్ణయాలు పెద్దలు అడ్డంపడి చేస్తారు. వీటికి అంతగా యూత్ అప్పీల్ వుండదు. నాగశౌర్య, మాళవికా నాయర్ లతో నందినీ రెడ్డి తీసిన ‘కళ్యాణ వైభోగమే’ (2016) అనే ఫ్లాప్ ఇలాటిదే. అందులో ఎలాటి ఆధునిక యువ పాత్రలున్నాయో ప్రస్తుత కథలోనూ అలాటి ఆధునిక యువ పాత్రలే వున్నాయి. ఇవన్నీ సీనియర్ ఆడియెన్స్ నమ్మకాలని సంతృప్తిపర్చే, పెద్దవయసు పాత్రలకి తలవంచేవే. ఇలా ఈ కథకి మార్కెట్ యాస్పెక్ట్ ప్రశ్నార్ధకంగా మారింది. అసలు దీన్ని ‘కథ’ అనవచ్చా అనేది ఇంకో ప్రశ్న. దీన్ని ఈ కింద చూద్దాం.

ఎవరెలా చేశారు

ఎవరెలా చేశారని చెప్పుకునే ముందు ఈ కథకి ప్రధాన పాత్ర ఎవరని ప్రశ్నించుకోవాలి. ఇలాటి ప్రశ్న తలెత్తిందంటే సినిమా ప్రాబ్లంలో పడ్డట్టే. నిత్యా, లేక చందూ.. ఎవరు ప్రధాన పాత్ర? ఎవరూ కాదు. ఒక ప్రధాన పాత్రంటూ లేని హోల్ సెల్ ఫ్యామిలీ డ్రామా ఇది. ఓ ప్రధాన పాత్రా, అది ఎదుర్కొనే ఒక బలమైన సమస్యా వుంటే అప్పుడది బలమైన ‘సినిమా కథ’ అవుతుంది. లేకపోతే బాక్సాఫీసు వ్యతిరేక బలహీన ‘గాథ’ అవుతుంది. ఇది ఫ్యామిలీ గాథే. ఈ గాథలో ప్రతివొక్కరూ తమ కిచ్చిన పాత్రలతో మెప్పించారనే చెప్పొచ్చు. ఇందులో సందేహం లేదు. పాత్రలు కథగా లేని ప్రపంచంలో విహరించడమే బోరు కొట్టే సమస్య.

నిత్య పాత్రలో ప్రియా వడ్లమాని అనే కొత్త నటి వండర్. రెండో వండర్ చందూ పాత్రలో సాయిశ్రీనివాస్, మూడో వండర్ దీక్షాశర్మ. ముగ్గురికీ మంచి భవిష్యత్తు వుంటుంది. కానీ వచ్చిన చిక్కల్లా, మొదటి స్మాల్ బడ్జెట్ మూవీ తో ఎవరెంత బాగా ప్రూవ్ చేసుకున్నా వాళ్ళని అంది పుచ్చుకుని కొనసాగించే స్మాల్ బడ్జెట్ మూవీ దర్శకుల్లేరు. ప్రతీ స్మాల్ బడ్జెట్ మూవీ కొత్త దర్శకుడూ తన సినిమాకి కొత్త వాళ్ళనే చూసుకుంటున్నాడు. దీంతో వస్తున్న కొత్త నటీ నటులు ఆ ఒక్క సినిమాతోనే ఇంటికెళ్ళి పోతున్నారు ఎంత ప్రూవ్ చేసుకున్నా. సినిమాకొక కొత్త జంటని చూస్తున్న ప్రేక్షకులకీ విసుగెత్తి పోతోంది.

పోతే, ఇతర అన్ని పాత్రల్లో అందరూ ఫ్యాబులస్ గా వున్నారు. ఒక్క నాటు మోటు పాత్రా, నాటు మోటుగా కన్పించే నటీనటులూ లేరు. అందర్నీ ఒక ఫాంటసికల్ ప్రపంచంలో ఏంజెల్స్ లా చూపిస్తూ మనోజ్ఞం చేశాడు కొత్త దర్శకుడు. పట్టు చీరెలూ, వడ్డాణాలూ, వొంటి నిండా నగలూ, కొప్పులూ, మేకప్పులూ దిగేసుకున్న రోత పాత్రలేవీ లేవిందులో. ఫ్రెష్ నెస్ తో చాలా రిలీఫ్ నిచ్చే సన్నివేశాలు, విజువల్స్. ఇందులో దర్శకుల సంఘం సభ్యురాలు ప్రియదర్శనీ కృష్ణ వాణి పాత్రలో నటిగా పరిచయమయ్యారు.

కానీ నిత్య పాత్రతోనే సమస్య. స్కర్ట్స్ ధరించే, సిగరెట్ స్మోకింగ్ కార్పొరేట్ హంచో అయిన తను, తన పెళ్లి తనిష్టమని ఇంట్లో ఎందుకు చెప్పుకోలేదో అర్ధంగాదు. నిశ్చితార్ధం నోర్మూసుకుని చేసుకోవడమేమిటి… సగటు ఆడపిల్లలా అర్ధరాత్రి ప్రియుడితో లేచిపోవడమేమిటి… లేచిపోయి పోలీసులకి దొరికి వణికి పోవడ మేమిటి…

తక్కువ బడ్జెట్ లో కూడా సాంకేతికంగా, సంగీతపరంగా వేలెత్తి చూపకుండా చేశారు. విజువల్స్ నీటుగా, క్లాసుగా తీశారు. పైన చెప్పుకున్నట్టు ఒక ఫాంటసీ వరల్డ్ ని క్రియేట్ చేశాడు దర్శకుడు.

చివరికేమిటి

బోయపాటి, వంశీ పైడిపల్లిల దగ్గర పనిచేసిన కొత్త దర్శకుడు శ‌ర‌త్‌ న‌ర్వాడే, తన ఈ తొలి ప్రయత్నంతో స్టోరీ డిపార్ట్ మెంట్ లో రాణించలేకపోయాడు. పైన చెప్పుకున్నట్టు, ఇది కథ కాకుండా గాథ అవడం, ఒక ప్రధాన పాత్రలేక పోవడం రెండూ ఫండమెంటల్ ప్రాబ్లమ్స్. బేసిక్సే లేని స్క్రిప్టుతో ఎంత కష్టపడ్డా ఫలితం వుండదు. యూత్ ని ఆకర్షించే అంశాలకంటే పెద్ద పాత్రల కుటుంబ వ్యవహారాలే డామినేట్ చేశాయి. రెండు జంటల రోమాన్స్ కి కూడా టైమివ్వలేదు. ఒక వేళ ఫ్యామిలీ డ్రామాగానే చేయాలనుకుని వుంటే, కుటుంబానికి పెద్దవయసు అన్న పాత్ర వుంది, దాన్ని కేంద్ర బిందువుగా చేసి, ఓ సమస్యనిచ్చి నడపాల్సింది. ఓల్డ్ డ్రామాయే అవుతుంది. తప్పదు. రోమాంటిక్ డ్రామా మీద దృష్టి పెట్టనప్పుడు ఫ్యామిలీ డ్రామా అయినా అవ్వాలి – ఎటూ కాకుండా పోయేకన్నా. ప్రారంభం నుంచీ ముగింపుదాకా నిత్య పెళ్లి సెటప్ తోనే పెళ్లి వారింట్లో మార్పు లేని మొనాటనీ గా సాగుతుంది. ఇలాటిదే తొలి షాట్ నుంచీ చివరి షాట్ వరకూ పెళ్లి వీడియో లాంటి ‘హేపీ వెడ్డింగ్’ వచ్చి ఫ్లాపయ్యింది. సుమంత్ అశ్విన్, నిహారికా కొణిదెలలు నటించారు. గత జూన్ లోనే విడుదలయ్యింది.

ఇది కథ కాదు, కమర్షియల్ సినిమాకి మేలు చెయ్యని గాథ…పైగా లైటర్ వీన్. లైటర్ వీన్ తో వచ్చే సమస్యేమిటంటే సంఘర్షణ వుండదు. వున్నా కమర్షియల్ సినిమాని నిలబెట్టేంత బలంగా వుండదు. దర్శకుడి పొరపాటు ఇదే. చెబుతున్న విషయం లోతుపాతుల్లోకి వెళ్ళకుండా పైపైన తీసేయడం. పాత్ర చిత్రణల్ని నమ్మించేట్టుగా బలంగా చేయకపోవడం. దీంతో సెకండాఫ్ పూర్తిగా చప్పబడి పోయింది. సినిమా అంటే టీవీ సీరియల్ కాదుగా?

కానీ తక్కువ బడ్జెట్ లో ఇంత విజువల్ క్వాలిటీ సాధించడం విశేషం. విషయం లేకపోయినా విజువల్ క్వాలిటీ కోసం ఓసారి చూడ దగ్గదిగా వుంది.

 

స్క్రీన్ ప్లే – దర్శకత్వం : శ‌ర‌త్‌ న‌ర్వాడే
తారాగణం: శ్రీ‌నివాస్‌సాయి, ప్రియ‌ వ‌డ్ల‌మాని, దీక్షాశ‌ర్మ‌ రైనా, ఇర్ఫాన్‌, సింధు, మోనాబేద్రె, అప్పాజీ, అంబ‌రీష త‌దిత‌రులు.
క‌థ‌-మాట‌లు: జ‌నార్ధ‌న్ ఆర్‌.ఆర్‌ -విస్సు,
క‌థాస‌హ‌కారం: సి.విద్యాసాగ‌ర్‌
సంగీతం: కె.యం.రాధాక్రిష్ణన్‌,
ఛాయాగ్రహణం : య‌స్‌.ముర‌ళీమోహ‌న్‌రెడ్డి
నిర్మాత‌లు: విద్యాసాగ‌ర్‌, జ‌నార్ధ‌న్ ఆర్‌.ఆర్‌
విడుదల: 7 డిసెంబర్ 2018

Rating: 2.25 / 5