‘టాక్సీవాలా’కథ వేరే హీరోలకు చెప్తే ఏం చేసారో తెలుసా?

కష్టపడి తీసిన సినిమా..ఎన్నో హర్డిల్స్ దాటుకుని హిట్ కొట్టిన తర్వాత ఆ దర్శక,నిర్మాతలకు వచ్చే ఆనందమే వేరు. ఆ సినిమా విషయంలో తాము పడ్డ కష్టాలన్ని మర్చిపోవాలనుకున్నా అవే గుర్తు వస్తూంటాయి. అందరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు అదే పరిస్దితి ‘టాక్సీవాలా’దర్శకుడుది.

విజయ్‌దేవరకొండ, ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టాక్సీవాలా’. జి.ఎ 2 పిక్చర్స్‌, యు.వి.క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.ఎన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రిలీజ్ కు ముందే పైరసీ వచ్చేసింది. అందరికీ నమ్మకాలు పోయాయి. అయితేనేం …ఈ సినిమా విడుద‌లై సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంగా ఈ సినిమా టీమ్ అంతా సక్సెస్ టూర్ ని నిర్వ‌హించింది. అందులో భాగంగా భీమవరం వెళ్లారు. అక్కడ అభిమానులతో దర్శకుడు మాట్లాడారు.

ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రిత్యాన్ మాట్లాడుతూ.. ‘‘ టాక్సీవాలా రైడ్ గురించి చెప్పాలంటే 2016 నుంచి మొద‌ల‌యింది. నేను నా రైట‌ర్ క‌లిసి రాసుకున్నాం. చాలా మంది హీరోల‌కి చెప్పాం. కొంత‌మంది క‌థ వింటూ నిద్ర‌పోయారు. కాని క‌థ అటూ ఇటూ తిరిగి ఫైన‌ల్‌గా జీఏ2 పిక్చ‌ర్స్‌, యువి క్రియేష‌న్స్ వంటి పెద్ద బ్యాన‌ర్‌లో రావ‌డం, విజ‌య‌దేవ‌ర‌కొండ లాంటి మంచి హీరో దొర‌క‌డం మా అదృష్టం.

మేము ఈ రోజు ఇంత స‌క్సెస్‌గా మీ ముందు ఉన్నామంటే కారణం ప్రేక్షకులే. ప్రొడ్యూస‌ర్స్‌, హీరోలు సినిమాలు ఇస్తారు కాని స‌క్సెస్ మాత్రం ఇచ్చేది ప్రేక్షకులే. పైర‌సీ అయి సినిమా బ‌య‌ట‌కు వ‌చ్చినా కూడా థియేట‌ర్ల‌లో చూసి ప్రేక్షకులు ఇంత బ్లాక్ బ‌స్ట‌ర్ చేశారంటే గ్రేట్‌. విజ‌య్ యూత్‌కే కాదు ఇన్‌స్పిరేష‌న్.. మా సినిమా టీమ్ కూడా..’’ అని అన్నారు.